అభివృద్ధిని రాజకీయ కోణంలో చూడడం తగదని అభిప్రాయపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం(ఏఎంయూ) శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ఆయన.. ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. వర్సిటీని 'మినీ ఇండియా'గా అభివర్ణించారు.
"ప్రతికూలతను వ్యాప్తి చేసే వ్యక్తులను ప్రతిచోట చూడొచ్చు" అని ప్రధాని వ్యాఖ్యానించారు. దాదాపు నెల రోజులుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'నవీన భారత్‌ను నిర్మించడానికి ఓ వేదిక అవసరం. అదే ఆత్మనిర్భర్‌భారత్' అని పేర్కొన్నారు మోదీ.
'డ్రాప్ అవుట్లు తగ్గాయి'
70 ఏళ్లుగా ముస్లిం బాలికల దుస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని. ముస్లిం బాలికల్లో డ్రాప్ అవుట్లు ఎక్కువ ఉండేవన్నారు. అయితే స్వచ్ఛభారత్ మిషన్ కారణంగా డ్రాప్ అవుట్ల శాతం 30కి తగ్గిందని తెలిపారు.
దేశంలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు ప్రధాని. నూతన విద్యావిధానం 21వ శతాబ్దంలో విద్యార్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.. శతాబ్ది కాలంలో ఏఎంయూ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఎంతో మందిని విద్యావేత్తలగా విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందన్నారు.
ఇదీ చూడండి:నేతాజీ జయంతి కార్యక్రమాలకు షా నేతృత్వంలో కమిటీ