నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న భాజపా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్గా సాగే ఈ కార్యక్రమం వివిధ డిజిటల్, సామాజిక వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు కూడా పాల్గొననున్నారు.
ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నారు పార్టీ నేతలు. పార్టీ తత్వం, సంస్కృతి, విధానాలపై చర్చించనున్నట్లు భాజపా జాతీయ మీడియా అధికార ప్రతినిధి అనిల్ బలూనీ వెల్లడించారు.
జన సంఘ్, జనతా పార్టీల విలీనంతో 1980లో భాజపా ఏర్పడింది. 1984లో తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 2 స్థానాలతో తన ప్రస్థానం మొదలుపెట్టింది. 2014లో మొదటి సారి అధికారంలోకి వచ్చిన భాజపా, 2019లోనూ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది.