కరోనా ఉద్ధృతిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేసిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంక్షలు అమలవుతున్న తీరుపై చర్చించారు.
కరోనా రెండో దశను ఠాక్రే ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని మోదీ ప్రశంసించారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా విషయంలో మహారాష్ట్రకు మరింత సహకరిస్తామని చెప్పినట్లు తెలిపింది.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌కు సైతం మోదీ కాల్ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యల గురించి సీఎంను ఆరా తీశారు. వైరస్ కట్టడికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మోదీ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి విప్లబ్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం మరిన్ని కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.