దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన ఆరు వారాల తర్వాత కరోనా టీకా తీసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సోమవారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి వ్యాక్సిన్ తొలి డోసు స్వీకరించారు. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. మోదీ టీకా స్వీకరించిన విషయానికి విశేష ప్రాధాన్యం ఉంది. దేశీయ టీకాను వేయించుకొని భారత శాస్త్రవేత్తలకు గౌరవం కల్పించడమే కాకుండా.. కొవాగ్జిన్ టీకాను తీసుకొని విమర్శలకు చెక్ పెట్టారు మోదీ.
దేశంలో అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతించిన కరోనా టీకాల్లో కొవాగ్జిన్ ఒకటి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ టీకాను తయారు చేసింది. భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్(ఎన్ఐవీ)తో కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌కు సైతం అత్యవసర అనుమతులు వచ్చాయి. దీన్ని పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.
కొవాగ్జినే ఎందుకు?
అయితే, కొవిషీల్డ్‌కు బదులుగా కొవాగ్జిన్ టీకాను స్వీకరించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బలమైన సందేశాన్ని ఇచ్చినట్లైంది. దేశంలోని అత్యున్నత పదవిలో ఉన్న నేత ఈ టీకాను స్వీకరించడం ద్వారా భారత శాస్త్రవేత్తల సామర్థ్యాలను గుర్తించినట్లైంది.
కొవిషీల్డ్ భారత్‌లో తయారైనా.. విదేశీ సంస్థలు దాని అభివృద్ధిలో భాగమయ్యాయి. కానీ, కొవాగ్జిన్ పూర్తిస్థాయి స్వదేశీ టీకా. అందులోనూ భారత ప్రభుత్వానికి చెందిన సంస్థలు కొవాగ్జిన్ తయారీలో పాల్గొన్నాయి. అందుకే కొవాగ్జిన్‌కు మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వారికి చెక్
రెండో విషయం టీకా భద్రత. కొవాగ్జిన్ టీకాపై కొన్ని వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడో దశ ప్రయోగ ఫలితాలు వెలువడక ముందే కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఆదరాబాదరాగా టీకాను అందుబాటులోకి తీసుకొస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. వీటన్నిటికీ మోదీ ఇప్పుడు చెక్ పెట్టినట్లైంది. కొవాగ్జిన్ తీసుకోవాలన్న మోదీ నిర్ణయంతో.. డీసీజీఐ అనుమతులపై సంశయం వ్యక్తం చేసినవారికి బలమైన సందేశం వెళ్లింది.