గుప్కార్ నేతలో నిర్వహించిన సమావేశం.. అభివృద్ధి ప్రగతిశీల జమ్ముకశ్మీర్ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కీలకమైన ముందడుగు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ త్వరగా పూర్తై.. ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గురువారం దిల్లీలో గుప్కార్ కూటమి నేతలతో భేటీ(PM Modi meets JK leaders) అనంతరం ఆయన ఈమేరకు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
"జమ్ముకశ్మీర్ నేతలో నేటి సమావేశం అభివృద్ధి, ప్రగతి శీల జమ్ముకశ్మీర్ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలలో కీలకమైన ముందడుగు. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటమే మా ప్రాధాన్యం. సరిహద్దుల నిర్ణయించే ప్రక్రియ త్వరగా పూర్తి కావాలి. దాంతో అక్కడి ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. తద్వారా జమ్మకశ్మీర్ అభివృద్ధి చెందుతుంది. "
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
అంతకుముందు సమావేశంలో భాగంగా.. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ జాతి ప్రయోజనాల కోసం, జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు మోదీ. 'దిల్లీకి దూరీ, దిల్కి దూరీ' నినాదం చేస్తూ కశ్మీర్- దిల్లీ దూరానికి, హృదయాల మధ్య దూరానికి ముగింపు పలకాలి అనుకుంటున్నట్టు వెల్లడించారు.
ఆ రెండూ కీలకం..
నియోజకవర్గాలు నిర్ణయించే ప్రక్రియ పూర్తవటం, శాంతి పూర్వకంగా ఎన్నికలు జరగటం.. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునురుద్ధరించే ప్రక్రియలో కీలకమైన అంశాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
"జమ్ముకశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. జమ్ముకశ్మీర్ భవిష్యత్తు గురించి మేం చర్చించాం. పార్లమెంటులో వాగ్దానం చేసినట్లు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి కల్పించటంలో నియోజకవర్గాలను నిర్ణయించే ప్రక్రియ పూర్తవటం, ప్రశాంతంగా ఎన్నికలు జరగటం కీలకమైన మైలురాళ్లు."