PM Narendra Modi tour : పదేళ్లుగా తెచ్చిన సంస్కరణలతో దేశంలో పన్ను ఆదాయం రికార్డు స్థాయిలో వస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని అన్నారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికైనవారికి శిక్షణ ఇచ్చేందుకు సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 541 కోట్ల రూపాయలతో నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదకద్రవ్యాల అకాడమీ-నాసిన్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇది సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా, ప్రముఖ శిక్షణా సంస్థగా వెలుగొందుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గత, ప్రస్తుత ప్రభుత్వాలు రెండూ నాసిన్ ఏర్పాటుకు సహకరించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్రానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకున్నారు. కాసేపట్లో నాసిన్ శిక్షణా కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రంలో రూ.541 కోట్లతో నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) ఏర్పాటైంది. 2015లో నాసిన్‌కు కేంద్రమంత్రులు శంకుస్థాపన చేయగా 503 ఎకరాల విస్తీర్ణంలో శిక్షణా కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికైన వారికి నాసిన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. నాసిన్ ఆవరణలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసిన కేంద్రం నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైను నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. నాసిన్ వద్ద కేంద్రీయ విద్యాలయం, ఈఎస్‌ఐ ఆస్పత్రికి స్థలాలను ఎంపిక చేశారు.