రైతులకు ప్రతి ఏటా అందించే పెట్టుబడి సాయం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత నిధులను వర్చువల్గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. పీఎం కీసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.19,509 కోట్లు జమయ్యాయి.
" ఈ ఏడాది దేశం 75వ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఈ ముఖ్యమైన మైలురాయి మనకు గర్వకారణమే కాదు.. కొత్త నిర్ణయాలు, లక్ష్యాలను నిర్దేశించుకునే కార్యక్రమం. వచ్చే 25 ఏళ్లలో భారత్ ఏ స్థాయిలో ఉండాలో ఈ కార్యక్రమం వేదికగా మనం నిర్ణయం తీసుకోవాలి. 2047లో వందేళ్ల స్వతంత్ర దినోత్సవం నాటికి వ్యవసాయంలో భారత్ ఏ పరిస్థితిలో ఉండాలి? దానిని నిర్ణయించటంలో గ్రామాలు, రైతులు కీలక పాత్ర పోషిస్తారు. వ్యవసాయానికి కొత్త దిశలను అందించాల్సిన సమయం ఇది. అది కొత్త సవాళ్లను ఎదుర్కోగలదు. కొత్త అవకాశాలను నుంచి లబ్ధి పొందుతుంది.
కరోనా మహమ్మారి సమయంలోనూ మన రైతుల సామర్థ్యాన్ని చూశాం. రికార్డు స్థాయిలో పంట దిగుబడుల నేపథ్యంలో రైతులకు ఎదురయ్యే సవాళ్లను తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. విత్తనాలు, ఎరువులు అందించటం నుంచి మార్కెట్లకు తమ పంటను తీసుకెళ్లే వరకు ప్రభుత్వం అండగా నిలిచింది. "