సమర్థమైన నీటి సంరక్షణ చర్యలు చేపట్టనిదే భారత్ వేగంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమనేది.. నీటి వనరులు, వాటి అనుసంధానం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణ కోసం 'క్యాచ్ ది రెయిన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు మోదీ. వచ్చే 100 రోజులు వాన నీటి పరిరక్షణ కోసం అంకితం కావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాకాలం వచ్చేంత వరకు ఉపాధి హామీ నిధులన్నీ వాన నీటి సంరక్షణ కోసమే ఖర్చు చేయాలని ఆకాంక్షించారు. వర్షపు నీటి వృథాపై ఆందోళన వ్యక్తం చేశారు.
"నీటి వనరుల అనుసంధానంపైనే భారతదేశం స్వయం సమృద్ధి సాధించడం ఆధారపడి ఉంది. అందుకే ఈ విషయంపై మా ప్రభుత్వం దృష్టిసారించింది. మన పూర్వీకులు అనేక నీటి వనరులను మనకు ఇచ్చారు. వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత. భారత్లో మెజారిటీ వర్షపు నీరు వృథా అవుతోంది. వాన నీటిని ఎంతగా పరిరక్షిస్తే.. భూగర్భ జలాలపై ఆధారపడటం అంతగా తగ్గుతుంది. "
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 4 కోట్ల కుటుంబాలకు నల్లా నీరు అందుతోందని చెప్పారు మోదీ. ఈ కార్యక్రమంలో మరింత మంది మహిళలను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. నీటి విలువ మహిళల కన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదని.. వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.