దేశంలోని మెరుగైన సాంకేతికత, డేటా, యువశక్తి.. సాంకేతిక అభివృద్ధికి భారీ అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ డికేడ్(దశాబ్దం) భారత్‌కు టెకేడ్ అని వ్యాఖ్యానించారు. దేశంలో డేటా భద్రతకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా ఆరో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆరేళ్ల కాలంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కేంద్రం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. సాంకేతికత సాధికారతలో డిజిటల్ ఇండియాది కీలక పాత్ర అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్ తయారు చేసిన ఆరోగ్య సేతు వంటి యాప్‌లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు.