తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాబోయే 25 ఏళ్ల కోసం పునాది... 'గతిశక్తి': మోదీ

ప్రతిష్ఠాత్మక 'పీఎం గతిశక్తి' కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దేశ అభివృద్ధి ప్రణాళికలను ఈ కార్యక్రమం వేగవంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.

GATISHAKTI
మోదీ గతిశక్తి

By

Published : Oct 13, 2021, 11:40 AM IST

Updated : Oct 13, 2021, 12:34 PM IST

దేశానికి రాబోయే 25 ఏళ్ల కోసం పునాది వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) పేర్కొన్నారు. రూ.100 లక్షల కోట్లతో రూపొందించిన పీఎం గతిశక్తి (PM Gati shakti) కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. దేశాన్ని 21వ శతాబ్దంలో నడిపించేది మల్టీ మోడల్ కనెక్టివీటీనే అని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూపొందించిన నేషనల్ మాస్టర్ ప్లాన్ (PM Gati shakti Master plan).. 21వ శతాబ్దంలో దేశ అభివృద్ధి ప్రణాళికలకు 'గతిశక్తి'గా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేలా ఇది దోహదం చేస్తుందని చెప్పారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని ఉద్ఘాటించారు. (PM Gati shakti scheme)

గతిశక్తి కార్యక్రమం ప్రారంభించిన మోదీ
గతిశక్తి కార్యక్రమం ఆవిష్కరణ
.

ఈ సందర్భంగా గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి పనుల్లో జరిగిన జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాని. గతంలో ఎక్కడ చూసినా 'పనులు జరుగుతున్నాయి' అని రాసి ఉన్న బోర్డులే దర్శనమిచ్చేవని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన అనేది చాలా రాజకీయ పార్టీలకు ప్రాధాన్యంశంగా లేదని, వారి మేనిఫెస్టోలలోనూ దీని గురించి ప్రస్తావన ఉండేది కాదని ఎద్దేవా చేశారు.

"అభివృద్ధి పనుల్లో మందగమనం వల్ల గతంలో పన్ను చెల్లింపుదారుల డబ్బు అపహాస్యానికి గురైంది. ప్రభుత్వ శాఖలు సమన్వయం లేకుండా పనిచేసేవి. గతంలో ఎక్కడ చూసినా 'పనులు జరుగుతున్నాయి' అన్న బోర్డులే కనిపించేవి. ఈ పనులు ఎప్పటికీ పూర్తి కావని ప్రజలంతా అనుకునేవారు. ఈ భావనను మేం మార్చేశాం. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి ప్రాజెక్టులకు 'గతి'ని జోడించాం. నాణ్యమైన మౌలిక సదుపాయాలే సుస్థిరాభివృద్ధికి మార్గం. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఉద్యోగ కల్పన జరుగుతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

గతిశక్తితో పాటు భారత వర్తక ప్రోత్సాహక సంస్థ కోసం నిర్మించిన నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్​లను సైతం మోదీ ప్రారంభించారు.

అంతకుముందు, దిల్లీలోని ప్రగతి మైదాన్​లో నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్​ నమూనాను సమీక్షించారు. కాంప్లెక్స్​కు సంబంధించిన వివరాలను అధికారులు.. మోదీకి వివరించారు.

కాంప్లెక్స్ గురించి వివరిస్తున్న అధికారులు
.

ఇక్కడే జీ20 సదస్సు

ఇదే కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్... దేశంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పీఎం గతిశక్తి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. పెట్టుబడులను సైతం ఆకర్షిస్తుందని చెప్పారు. ప్రగతి మైదాన్​లో 2023 జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుందని వెల్లడించారు.

ఏంటీ గతిశక్తి?

దేశంలో బహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించి రూ. 100 లక్షల కోట్లతో 'పీఎం గతిశక్తి' కార్యక్రమాన్ని రూపొందించారు. మౌలిక రంగాన్ని సమూలంగా మార్పు చేసి, శాఖల మధ్య సమన్వయం తీసుకొచ్చేలా దీన్ని సిద్ధం చేశారు. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా గతి శక్తి కార్యక్రమాన్ని ప్రకటించారు ప్రధాని మోదీ.

మౌలిక వసతుల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే శక్తి ఈ కార్యక్రమానికి (PM Gati shakti scheme) ఉన్నట్లు ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. గతిశక్తి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనులను 2024-25 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనుమతుల్లో జాప్యాన్ని నివారించి మౌలిక వసతుల నిర్మాణాన్ని సంపూర్ణంగా, వేగంగా కొనసాగించడానికి గతిశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఇదీ చదవండి:దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్​ సంక్షోభం

Last Updated : Oct 13, 2021, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details