దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ లేని రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ దిల్లీ మెట్రోలో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు.
"తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభం కావడం చూస్తే ఆధునికత వినియోగంలో భారత్ ఎంత వేగం కనబరుస్తోందో తెలుస్తోంది. దేశంలో తొలి మెట్రో రైలు.. వాజ్‌పేయీ కృషి వల్ల ప్రారంభమైంది. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 5 నగరాల్లోనే మెట్రో సేవలు ఉన్నాయి. ఇప్పుడు 18 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 2025 నాటికి 25 నగరాల్లో మెట్రో సేవలను విస్తరిస్తాం."
- నరేంద్ర మోదీ, ప్రధాని
ఈ చోదకరహిత రైలును.. మాజెంటా లైన్‌లో జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మజ్లిస్ పార్క్ నుంచి శివ్ విహార్ మధ్య 57 కిలోమీటర్లు పొడవునా డ్రైవర్ లేని మెట్రో సేవలు మొదలవుతాయని దిల్లీ మెట్రో వెల‌్లడించింది.