తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీబీఐపై ప్రజలకు విశ్వాసం.. అవినీతిపై బీజేపీ మిషన్​ మోడ్ పోరాటం' - సీబీఐ డైమండ్ జుబ్లీ వేడుకలు 2023

ప్రజాస్వామ్యానికి, న్యాయానికి.. అవినీతే అతిపెద్ద అడ్డంకి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సీబీఐ లాంటి సంస్థలపై పెద్ద బాధ్యతే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యానికి అవినీతే ప్రధాన అడ్డంకి అని.. దాన్ని నుంచి భారత్​ను విముక్తి చేయడమే సీబీఐ కీలక బాధ్యత అని చెప్పారు. సీబీఐ డైమండ్​ జుబ్లీ వేడుకలను మోదీ సోమవారం ప్రారంభించారు.

PM Narendra Modi CBIs Diamond Jubilee celebrations
PM Narendra Modi CBIs Diamond Jubilee celebrations

By

Published : Apr 3, 2023, 1:33 PM IST

Updated : Apr 3, 2023, 2:39 PM IST

ప్రజాస్వామ్యానికి, న్యాయానికి.. అవినీతే అతిపెద్ద అడ్డంకి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ.. తన పనితనం, నైపుణ్యంతో ప్రజల్లో విశ్వాసం కలిగించిందని కితాబిచ్చారు. సమర్థమైన, ప్రొఫెషనల్​ సంస్థలు లేకపోతే.. భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడం అసాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కాబట్టి అలాంటి సంస్థ అయిన సీబీఐ మీద పెద్ద బాధ్యతే ఉందని చెప్పారు. ఇప్పటికీ.. ఏ కేసు అయినా పరిష్కారం కాకపోతే.. సీబీఐకి అప్పగించండి అనే డిమాండ్లు వినిపిస్తాయని మోదీ గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఏర్పాటై 60 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న డైమండ్​ జుబ్లీ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం దిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

"దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడమే సీబీఐ లక్ష్యం. నల్లధనం, బినామీ ఆస్తులపై చర్యలు ప్రారంభించాం. అవినీతిపరులతో పాటు అవినీతికి గల కారణాలపైనా పోరాడుతున్నాం. సీబీఐ తన పనితనం, నైపుణ్యంతో ప్రజలకు నమ్మకం కలిగించింది. ఇలా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం సాధారణ విజయం కాదు. అవినీతిపై పోరాడే రాజకీయ సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉంది. బహుళ విభాగాల దర్యాప్తు సంస్థగా సీబీఐ తన ప్రతిష్ఠను నిర్మించుకుంది. బ్యాంకు మోసాల నుంచి వన్యప్రాణులకు సంబంధించిన నేరాల వరకు సీబీఐ పరిధి విస్తరించింది. అవినీతిపరులు ఎవరూ తప్పించుకోరాదు అనేది.. దేశం, దేశ ప్రజల కోరిక. ప్రతిభకు అనినీతే పెద్ద శత్రువు. బంధుప్రీతి, కుటుంబ వాదం పెరగడానికి ఇదే కారణం.
--ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

2014లో తాము గెలిచిన తర్వాత ప్రజల్లో వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడమే మొదటి ప్రాధాన్యతగా ఉందని మోదీ తెలిపారు. అందుకే అవినీతితో పాటు అవినీతికి కారణమైన అంశాలపై దాడులు చేయడం మొదలుపెట్టాం అని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను దోచుకుంటూ.. అవినీతిపరులు దశాబ్దాలుగా దేశ సంపదను లూటీ చేశారని మండిపడ్డారు.
దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ప్రారంభమై ఈ వేడుకల్లో విశేషమైన పనితీరు కనబరిచిన సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీస్‌ పతకాలు, ఉత్తమ విచారణ అధికారులకు బంగారు పతకాలను మోదీ అందజేశారు. సీబీఐపై పోస్టల్‌ స్టాంపును, నాణేన్ని ఆవిష్కరించారు. వివిధ నగరాల్లో నిర్మించిన సీబీఐ కార్యాలయ సముదాయాలను ఈ సందర్భంగా ప్రధాని ప్రారంభించారు.

Last Updated : Apr 3, 2023, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details