ఆస్పత్రులకు ఆక్సిజన్ సహాయాన్ని అందించడంలో వినూత్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచేలా, పంపిణీని వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై ఉన్నతాధికారులతో ప్రధాన మోదీ.. గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని అధికారులను మోదీ ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఎదురైనప్పుడు స్థానిక అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రాలన్నీ ఆక్సిజన్‌ను నిల్వ చేయకూడదని మోదీ స్పష్టం చేశారు.
"రాష్ట్రాల డిమాండ్‌కు తగ్గట్టుగా ఆక్సిజన్ సరఫరాను క్రమంగా మేం పెంచుతున్నాం. ప్రస్తుతం 20 రాష్ట్రాలకు 6,785 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం కాగా.. ఏప్రిల్ 21 నుంచి ఈ రాష్ట్రాలకు 6,822 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నాం. ప్రైవేటు, ప్రభుత్వ పరిశ్రమల సాయంతో రోజుకు 3,300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. దూర ప్రాంతాలకు సరఫరా చేయటంలో రైల్వేశాఖ సాయాన్ని తీసుకుంటున్నాం."