21వ శాతాబ్దంలో దేశాభివృద్ధికి వ్యవసాయం, సైన్స్ మధ్య సమన్వయం ఎంతో కీలకమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi). వ్యవసాయ రంగంలోని సవాళ్ల పరిష్కారానికి ఏడేళ్లుగా శాస్త్ర, సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక లక్షణాలున్న 35 పంట రకాలను (Crop Varieties) జాతికి అంకితం చేసిన సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఈ సరికొత్త పంట రకాలను ఆధునిక ఆలోచన కలిగిన రైతులకు అంకితమిస్తున్నా. వ్యవసాయ రంగంలోని సవాళ్ల పరిష్కారానికి ఏడేళ్లుగా శాస్త్ర, సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నాం. ప్రత్యేకించి మారుతున్న కాలాలకు అనుగుణంగా, పోషక విలువలు కలిగిన విత్తనాలపై దృష్టి సారించాం."
-ప్రధాని నరేంద్ర మోదీ
కొత్త పంట రకాలతో (crop variety improvement) దేశంలోని పోషకాహార లోపాలు తగ్గుతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక గతేడాది.. పలు రాష్ట్రాల్లో మిడతల దాడిని ప్రస్తావిస్తూ.. ఎన్నో ప్రయత్నాల తర్వాత వాటిని అడ్డుకొని రైతులకు భారీ నష్టాన్ని తప్పించినట్లు చెప్పారు.