కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం. ఆయా రాష్ట్రాల రాజకీయ కారణాల వల్ల జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), సుశీల్‌కుమార్ మోదీ (బిహార్), సర్బానంద సోనోవాల్ (అసోం)లకు కేంద్ర కేబినెట్‌లో బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎక్కువ అవకాశాలున్న ఇలాంటివారు దిల్లీకి చేరుకుంటున్నారు.
ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం..
ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎక్కువ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో యూపీ నుంచి ఉన్న 9 మందిలో నలుగురైదుగురికి స్థానచలనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. రీటా బహుగుణ జోషికి అవకాశం వస్తే అదే సామాజికవర్గానికి చెందిన నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి ఉద్వాసన ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. యూపీ నుంచి అవకాశం దక్కే అవకాశాలున్నవారిలో జోషితో పాటు, అజయ్‌మిశ్ర, సకల్‌దీప్ రాజ్‌భర్, పంకజ్ చౌదరి, రాంశంకర్ కతేరియా, వరుణ్‌గాంధీ, రాజ్‌వీర్‌సింగ్, అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
వారిని కేబినెట్ నుంచి తప్పించి..
మాయావతి, ప్రియాంక గాంధీ వంటి మహిళా నేతలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి తప్పించి, యూపీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు- ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలనుంచి పెద్దగా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు పేరు మాత్రం వినిపిస్తోంది.
ఏ రాష్ట్రం నుంచి ఎవరికి అవకాశం?