తాను దేశ అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం కష్టపడున్నానని.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం తన సమాధి కట్టడంలో బిజీగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదాలే తనకు రక్షణ కవచాలని చెప్పారు. మైసూరు-బెంగళూరు మధ్య నిర్మించిన ఎక్స్ప్రెస్ వేను కర్ణాటకలోని మండ్యలో ప్రధాన మంత్రి ఆదివారం ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
"దేశ అభివృద్ధి కోసం, ప్రజల జీవనం మెరుగుపడడం కోసం, మైసూరు-బెంగళూరు రహదారి కట్టడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? మోదీకి సమాధి కట్టాలని కాంగ్రెస్ కలలు కంటోంది. నా సమాధి కట్టాలనుకునే కాంగ్రెస్ నేతలకు తెలియదు.. నాకు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదముందని. ఆ ఆశీర్వాదమే నాకు రక్షణ కవచం. పేదలను ఇబ్బందులకు గురి చేసే వారిని నేను వదిలిపెట్టను.పేదల అభివృద్ధికి కావాల్సిన రూ.కోట్ల డబ్బును కాంగ్రెస్ లూటీ చేసింది. మిమ్మల్ని(ప్రజలను ఉద్దేశించి) కాపాడటానికి 2014 నాకు అవకాశమిచ్చారు. దానివల్లే మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం పేదల బాధల్ని, ఇబ్బందులను అర్థం చేసుకుంటుంది. వాటి నుంచి విముక్తి పొందేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది"
-- ప్రధాని నరేంద్ర మోదీ