PM Modi At National Handloom Day 2023 : భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కొందరు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్విట్ ఇండియా స్ఫూర్తిగా ప్రస్తుతం దేశ ప్రజలంతా అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు. విపక్ష కూటమి 'ఇండియా'ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. జాతీయచేనేతదినోత్సవం సందర్భంగా దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. గత 9 ఏళ్లలో ఖాదీ ఉత్పత్తి 3 రెట్లు, ఖాదీ వస్త్రాల ఉత్పత్తి 5 రెట్లు పెరిగిందన్నారు. విదేశాల్లో సైతం మన ఖాదీ వస్త్రాల వినియోగం పెరిగిందని చెప్పారు. స్వాతంత్ర్యం అనంతరం చేనేత పరిశ్రమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. 2014లో రూ. 25 వేల కోట్లు ఉన్న ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు.. ప్రస్తుతం రూ.1.30 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.
National Handloom Day 2023 In Telugu : గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రారంభించిన ఎక్తా మాల్స్‌ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రధాన మోదీ వెల్లడించారు. వీటితో పాటు టెక్స్టైల్ సంస్థలకు అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. చేనేత, ఫ్యాషన్ రంగాలు తమ పరిధిని విస్తరించుకొని.. భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా మార్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. నేత కార్మికులకు సబ్సిడీ ధరలకే దారాలు ఇస్తున్నామని.. కొత్త డిజైన్లు రూపొందించడానికి అధునాతన సాంకేతికతను సైతం అందిస్తున్నట్లు చెప్పారు. చేనేత వస్తువుల మార్కెటింగ్ విషయంలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.