కరోనా కట్టడి విషయమై కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ తన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత అజెండాతో కాకుండా.. ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) పేర్కొంది. కేంద్ర సర్కారు టీకా వ్యూహంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్.. సరఫరా తగినంతగా లేదని ఆరోపించింది. అలాగే ధరల విధానంలో కూడా పారదర్శకత లేదని ధ్వజమెత్తింది.
కరోనా కేసులు, మరణాల గణాంకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీడబ్ల్యూసీ.. ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి నివేదికలు లేవని ఆరోపించింది. అలాగే సమస్యను ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కారు తమ తెగువ చూపాలని.. నిజాన్ని దాచే విషయంలో కాదని వ్యాఖ్యానించింది. కొవిడ్ రెండోదశను తీవ్ర విపత్తుగా అభివర్ణించిన కాంగ్రెస్.. ఇది మోదీ సర్కారు ఉదాసీనత, అసమర్థతకు ప్రత్యక్ష పర్యవసానమని పేర్కొంది.