కరోనా మూడోదశ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు. 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా' విధానాన్ని మరింత విస్తరింపజేయాలన్నారు. కొవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న ఆరు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశమై, ఈమేరకు మార్గనిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు సీఎంలు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. కరోనాపై మరింత అవగాహన, అప్రమత్తత అవసరమన్నారు. పరిస్థితులు చేయిదాటితే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గడిచిన వారం నుంచి 80 శాతం కేసులు.. ఆ ఆరు రాష్ట్రాల్లోనే వెలుగు చూస్తున్నాయని.. కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోందన్నారు ప్రధాని.