తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాలిబన్ల ప్రభుత్వానికి గుర్తింపుపై మోదీ కీలక వ్యాఖ్యలు

తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంపై అంతర్జాతీయ సమాజం విస్త్రతంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలన్నారు ప్రధాని మోదీ. ఈ విషయంలో ఐరాసకు భారత్​ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్​సీఓ-సీఎస్​టీఓ సదస్సుకు వర్చువల్​గా హాజరైన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Pm modi
మోదీ

By

Published : Sep 17, 2021, 5:37 PM IST

Updated : Sep 17, 2021, 6:56 PM IST

అఫ్గాన్​లోని తాజా పరిణామాలు.. భారత్​తో సహా పొరుగు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆసియా ప్రాంతంలో అనిశ్చితి పెరుతుందని.. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, వేర్పాటువాద సిద్ధాంతాలు ఊపందుకుంటాయని హెచ్చరించారు. అఫ్గాన్​ సంక్షోభంపై ఏర్పాటు చేసిన ఎస్​సీఓ సమావేశంలో వర్చువల్​గా పాల్గొన్న మోదీ.. ఈ వ్యవహారంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.

"భారత్​ సహా పొరుగు దేశాలపై అఫ్గాన్​ పరిణామాల ప్రభావం పడుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలోని దేశాలు అఫ్గాన్​ వ్యవహారంపై దృష్టి సారించాలి. సమస్య పరిష్కారానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మనం నాలుగు అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అఫ్గానిస్థాన్​లో ప్రభుత్వ ఏర్పాటు అందరి ఆమోదంతో జరగలేదు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్​లోని కొత్త వ్యవస్థను గుర్తించాలా? వద్ద? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ప్రభుత్వంలో మహిళలు, మైనారిటీలు, అన్ని వర్గాల వారి భాగస్వామ్యం ఉండాలి. అందువల్ల.. కొత్త వ్యవస్థ గుర్తింపుపై అంతర్జాతీయ సమాజం సరైన నిర్ణయం తీసుకోవాలి. పూర్తిస్థాయిలో చర్చలు జరిపి, అన్నివైపులా వాదనలు విని ఓ నిర్ణయానికి రావాలి. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితికి భారత్​ పూర్తి మద్దతు ఇస్తుంది."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అత్యాధునిక ఆయుధాలు ఆఫ్గాన్​లోనే ఉండిపోయాయని, అందువల్ల ఆ ప్రాంతంలో అనిశ్చితి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు మోదీ.

'దుషాంబే డిక్లరేషన్'​ ఆమోదం..

ఎస్​సీఓ సమావేశంలో 'దుషాంబే డిక్లరేషన్​'ను ఆమోదించాయి సభ్య దేశాలు. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య, శాంతియుత అఫ్గాన్​కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. అన్ని వర్గాలతో కూడిన ప్రభుత్వం అఫ్గాన్​లో ఉండాలని అభిప్రాయపడ్డాయి. ఉగ్రవాదాన్ని ఖండించాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించి, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు అందకుండా చేసేందుకు చర్యలు చేపట్టే విధంగా ప్రణాళికలు రచించాలని సభ్య దేశాలు అంగీకారానికి వచ్చాయి.

అంతకుముందు.. షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఎస్​సీఓలో కొత్తగా ఇరాన్ చేరడాన్ని స్వాగతించారు. చర్చా భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, కతర్​కు కూడా స్వాగతం పలికారు.

ఎస్​సీఓ భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు ఇదే సరైన సమయమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, విశ్వసనీయత లోపించడం వంటి అంశాలు అతిపెద్ద సవాళ్లని తెలిపారు. అతివాదం, తీవ్రవాదం పెరగడమే ఈ సమస్యలకు మూల కారణమన్నారు. అఫ్గాన్​లో ఇటీవలి పరిణామాలు దీన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం, అతివాదం, తీవ్రవాదంపై పోరుకు ఎస్​సీఓ సభ్య దేశాలు ఓ పటిష్ఠ ప్రణాళిక రూపొందించి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్య ఆసియా దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-'తీవ్రవాదం పెను సవాల్- ఉమ్మడి పోరు తక్షణావసరం'

Last Updated : Sep 17, 2021, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details