తెలంగాణ

telangana

ETV Bharat / bharat

BRICS Summit 2021: అఫ్గాన్​ 'ఉగ్ర అడ్డా' కాకూడదు.. బ్రిక్స్​ పిలుపు - 13th brics meeting

ఇతర దేశాలపై ఉగ్రదాడులు జరపడానికి అఫ్గానిస్థాన్‌ భూభాగం ఉపయోగపడకూడదని 'బ్రిక్స్‌' కూటమి (BRICS Summit 2021) పిలుపునిచ్చింది. ఉగ్రవాదులు దేశ సరిహద్దులను దాటకుండా అడ్డుకోవాలని తీర్మానించింది. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా- ఈ అయిదు దేశాల కూటమి అయిన 'బ్రిక్స్‌' సదస్సు గురువారం వర్చువల్‌ విధానంలో జరిగింది. భారత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

narendra modi
నరేంద్ర మోదీ

By

Published : Sep 9, 2021, 5:45 PM IST

Updated : Sep 10, 2021, 6:58 AM IST

శాంతికి విఘాతం కలిగిస్తూ, అమాయకుల్ని బలి తీసుకునే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు కార్యాచరణ ప్రణాళికను అనుసరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ అధ్యక్షత గురవారం వర్చువల్‌గా జరిగిన 13వ బ్రిక్స్ దేశాల సమావేశంలో (BRICS Summit 2021) చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసోతో కలిసి మోదీ పాల్గొన్నారు.

ఛైర్మన్ హోదాలో బ్రిక్స్ 13వ వార్షికోత్సవ ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా బ్రిక్స్ అనేక విజయాలు సాధించిందని వెల్లడించిన మోదీ.. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గొంతుకగా బ్రిక్స్‌ నిలిచిందన్నారు. ప్రపంచ జనాభాలో 41 శాతం, ప్రపంచ జీడీపీలో 24 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 16 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్‌ దేశాలు.. అభివృద్ధికి మారుపేరుగా నిలిచాయని అభివర్ణించారు.

13వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ

ఈ సమావేశంలో అఫ్గాన్‌ సంక్షోభంతో పాటు, ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. అఫ్గాన్‌ పరిస్థితిని ప్రధానంగా ప్రస్తావించారు. అన్ని దేశాల జాతీయ భద్రత సలహాదార్లు కలిపి రూపొందించిన ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ ప్రణాళికకు బ్రిక్స్‌ కూటమి ఆమోదం తెలిపింది. ''ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ, ఎప్పుడు జరిగినా వ్యతిరేకించాలి. ఉగ్రవాదాన్ని మతం, జాతి, నాగరికత, ఎలాంటి స్థానిక వర్గానితోనూ ముడిపెట్టకూడదు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి పరిధిలో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి'' అని పిలుపునిచ్చింది. కరోనా మూలాలను కనుగొనేందుకు చేపట్టే అధ్యయనంలో సహకరించుకోవాలని బ్రిక్స్‌ నిర్ణయించింది.

అన్ని రంగాల్లో సహకరిస్తాం: పుతిన్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ దేశాలకు అన్ని రంగాల్లో సహకరిస్తామని చెప్పారు. ‘‘అవిరామ, సుస్థిర, ఏకాభిప్రాయ సాధన కోసం సహకారాన్ని పటిష్ఠపరచడం ఈ ఏడాది లక్ష్యంగా ఉండాలని భారత్‌ ప్రతిపాదించింది. ఇది చాలా సముచితం. ఇది ఒక్క బ్రిక్స్‌ లక్ష్యమే కాదు. మొత్తం ప్రపంచానికంతటికీ ఉండాలి. ఇందుకోసం రష్యా అంతా చేస్తుంది’’ అని హామీ ఇచ్చారు. అఫ్గాన్‌ సమస్యపై అభిప్రాయం చెబుతూ సైన్యాన్ని ఉపసంహరించడం ద్వారా అమెరికా అక్కడ కొత్త సంక్షోభాన్ని సృష్టించిందని ఆరోపించారు.

టీకాలు అందుబాటులో ఉండాలి: రామఫోసా

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా మాట్లాడుతూ కరోనా టీకాలను అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. మహమ్మారి కారణంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకునేలా సహకరించాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో సంస్కరణలకు కూడా సహకరించాలని కోరారు.

జిన్‌పింగ్‌ అయిదు సూత్రాలు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రసంగిస్తూ తదుపరి సదస్సుకు తాము ఆతిథ్యం ఇస్తామని తెలిపారు. పరస్పర సహకారం విషయంలో అయిదు సూత్రాలను ప్రతిపాదించారు. ప్రజారోగ్యం; టీకాలు; ఆర్థిక రంగంలో ఉమ్మడి ప్రయోజనం; రాజకీయ, భద్రత రంగాలు; అధ్యయనం కోసం ప్రజల మధ్య సహకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నో విజయాలు సాధించాం: మోదీ

ప్రధాని మోదీ ప్రసంగిస్తూ బ్రిక్స్‌ ఏర్పాటయిన 15 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించినట్టు చెప్పారు. ‘‘ఈ సదస్సుకు అధ్యక్షత వహించడం సంతోషకరంగా ఉంది. భారత్‌కు అన్ని సభ్యదేశాల సహకారం లభించింది. ప్రపంచంలో ప్రాధాన్యంగల గొంతుకగా ఎదుగుతున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలపై దృష్టి కేంద్రీకరించగలుగుతున్నాం. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఇంధన పరిశోధన సహకార వేదిక వంటి బహుముఖ ప్రయోజన సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. టీకాల పరిశోధన కేంద్రం ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరింది. పర్యావరణ హిత పర్యాటకంపైనా ఆలోచనలు కొనసాగుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

Last Updated : Sep 10, 2021, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details