తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సాగు చట్టాలు మంచివే.. ఆ విషయం చెప్పడంలోనే మేము విఫలం!' - సాగు చట్టాలు ఈటీవీ భారత్​

సాగు చట్టాల రద్దుపై ప్రధాని మోదీ(pm modi news) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్​ స్వాగతించారు(farm laws repealed). అయితే చట్టాలతో ప్రయోజనాలే ఎక్కువని, వాటిని రైతుల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తూనే ఉంటుందని, ఇలా చట్టాలను వెనక్కి తీసుకోవడం బాధ కలిగించిందన్నారు.

farm laws repealed
తోమర్​

By

Published : Nov 19, 2021, 4:37 PM IST

మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను (pm modi news) కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ స్వాగతించారు. అయితే, చట్టాలతో కలిగే ప్రయోజనాలను కొన్ని రైతు సంఘాలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో ప్రభుత్వం విఫలమైనందుకు బాధపడుతున్నట్టు వెల్లడించారు(farm laws repealed).

రైతుల సమస్యలు తొలగించేందుకే ఈ చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు పునరుద్ఘాటించారు తోమర్​. వీటితో అన్నదాతలకు మంచి జరిగేదని, వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ కృషి చేశారన్నారు.

"ఈ చట్టాలతో కలిగే లాభాలను కొన్ని రైతు సంఘాలకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోయాము. చాలా బాధగా ఉంది. వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ నిత్యం శ్రమిస్తారు. కాని కొందరికి ఈ చట్టాల్లో లోపాలు కనిపించాయి. వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించాము. కానీ ఫలితం దక్కలేదు."

--- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి.

2014 నుంచి రైతుల కోసం చేపట్టిన పథకాలను ఈ సందర్భంగా వివరించారు తోమర్​.

ఇదీ చూడండి:-సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

సాగు చట్టాల రద్దుపై ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా ఇదే తరహాలో స్పందించారు.

"వాస్తవానికి రైతుల్లో చాలా మంది ఈ చట్టాలకు మద్దతిచ్చారు. వీటితో వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించవచ్చని విశ్వసించారు. కొందరికి మాత్రమే ఈ చట్టాలు నచ్చలేదు. ఆ రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. కానీ ప్రజలకు మేము ఏం చెబుదామని అనుకున్నామో, అందులో విజయం సాధించలేకపోయాము. ప్రధాని మోదీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇదొక చారిత్రక నిర్ణయం."

--- యోగి ఆదిత్యనాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ సీఎం.

మోదీపై షా ప్రశంసలు...

సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.

"గురునానక్​ జయంతి రోజు మోదీ ఈ ప్రకటన చేయడం ఎంతో ప్రత్యేకం. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ఇతర ఆలోచనలు లేవని ఇది నిరూపిస్తుంది. మోదీ తన అనుభవం, నాయకత్వ లక్షణాలను మరోసారి చూపించారు. మోదీ చెప్పినట్టే.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిత్యం కృషిచేస్తుంది."

--- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

మోదీ ప్రకటన..

3 సాగు చట్టాలపై రైతుల ఆందోళన ఏడాదిగా జరుగుతోంది(farmers protest news). రైతులతో ప్రభుత్వం అనేకమార్లు చర్చలు కూడా జరిపింది. అవేవీ ఫలించలేదు. సాగు చట్టాలను రద్దు చేసేంతవరకు ఆందోళనలు సాగుతాయని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. ఈ క్రమంలో.. శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు(Farm laws 2020) రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని అన్నారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details