PM Modi Will Be First To Have Darshan Of Sri Ram : అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహరాజ్ వెల్లడించారు. వాస్తవానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 6 రోజుల పాటు జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోదీ 6 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించలేరు కాబట్టి, ఆయనకు బదులుగా ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్ర తన సతీమణితో కలిసి అన్ని పూజల్లో పాల్గొంటారని వివరించారు.
'జనవరి 16 నుంచి 21 వరకు జరిగే అన్నీ పూజాకార్యక్రమాల్లో అనిల్ మిశ్ర దంపతులే పాల్గొంటారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుంది' అని గోవింద్ దేవగిరి మహరాజ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి, భగవంతుని దర్శనం చేసుకుంటారని, తరువాత హారతి ఇస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారు.
గుర్తుపట్టలేని విధంగా మారిన అయోధ్య
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం కేంద్రంతో సహా యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా అయోధ్యలో రూ.30 వేల కోట్లకు పైగా నిధులతో 179 ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టినట్లు నగర మేయర్ గిరీశ్ పతి త్రిపాఠీ తెలిపారు. ఓ ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఈ పనులు రేయింబవళ్లు జరుగుతున్నాయని, దాదాపు ముగింపు దశకు వచ్చాయని ఆయన తెలిపారు. ఒక ఏడాది కిందట లేదా రెండేళ్ల కిందట అయోధ్యకు వచ్చి వెళ్లిన వ్యక్తి ఇపుడు నగరాన్ని చూస్తే గుర్తుపట్టలేని విధంగా పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఆశ్రమాల నగరమైన అయోధ్యలో భక్తులకు వసతి సౌకర్యం పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు. పలు సంప్రదాయ రాత్రి బస కేంద్రాలు కూడా అయోధ్యలో ఉన్నాయి అన్నారు.
కట్టుదిట్టమైన భద్రత
శ్రీరామ విగ్రహం ప్రాణప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రత కోసం, అయోధ్య జిల్లా మొత్తం మీద 10 వేల ఏఐ-పవర్డ్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి మార్గాన్ని కవర్ చేస్తూ విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. అంతేకాదు వివిధ భాషలకు చెందిన పోలీసులు సాధారణ దుస్తుల్లో పహారా కాస్తారని స్పష్టం చేశారు. ప్రధాన రహదారులన్నీ గ్రీన్ కారిడార్‌లుగా మార్చామన్నారు. జనం రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల డ్రోన్లతో నిఘా వేస్తామని చెప్పారు.