తెలంగాణ

telangana

'దేశంలో ఆ పరిస్థితి మారాలి.. ఓటింగ్ శాతం పెరగాలి'

PM Modi Voting Percentage: దేశంలో ఓటింగ్​ శాతం పెంపుపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 'ఒకే దేశం- ఒకే ఎన్నిక' గురించి ప్రస్తావించిన మోదీ.. లోక్‌సభ ఎన్నికల నుంచి రాష్ట్ర అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను కనీసం 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

By

Published : Jan 25, 2022, 4:04 PM IST

Published : Jan 25, 2022, 4:04 PM IST

Updated : Jan 25, 2022, 4:26 PM IST

PM Modi voting
PM Modi voting

PM Modi Voting Percentage: ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్​ శాతం నమోదుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యావంతులు, సంపన్న ప్రాంతాలుగా పరిగణిస్తున్న పట్టణాల్లో తక్కువ ఓటింగ్​ శాతం నమోదవుతుండటంపై ఆవేదన వెలిబుచ్చారు. ఇంట్లో కూర్చొని ఎన్నికల గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుపుతారు కానీ ఓటు వేయడానికి వెళ్లరని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్​ వంటి శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశంలో ఈ పరిస్థితి మారాలని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా ఉన్న భాజపా కార్యకర్తలతో నమో యాప్ ద్వారా మాట్లాడిన సందర్భంగా 'ఒకే దేశం- ఒకే ఎన్నిక', 'ఒకే దేశం- ఒకే ఓటరు జాబితా' అంశాలను ప్రస్తావించారు మోదీ. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం అయినందున.. తక్కువ ఓటింగ్​ శాతం గురించి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నుంచి రాష్ట్ర అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలు.. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తాయని పేర్కొన్నారు.

1951-52లో జరిగిన తొలి లోక్​సభ ఎన్నికల్లో 45శాతం ఓటింగ్​ నమోదవగా.. 2019లో కేవలం 67 శాతానికి పెరిగిందని మోదీ గుర్తు చేశారు. అయితే మహిళా ఓటర్ల సంఖ్యలో వృద్ధి మంచి విషయమేనన్నారు. పౌరుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ తక్కువ పోలింగ్‌ శాతం పెంపుపై దృష్టి సారించాలని కోరారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పోలింగ్​ అత్యంత పవిత్రమైందని.. ప్రతి ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్​ జరిగేలా చూడాలని ప్రముఖల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరికీ సూచించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

వచ్చే లోక్​సభ ఎన్నికల్లో 75 పోలింగ్​!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను కనీసం 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వెంకయ్య సందేశాన్ని పంపారు. ఒక దేశంగా మనం ఆలోచించి మూడు అంచెల సమాఖ్యలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని.. వాటిపై దృష్టి సారించి మెరుగైన పాలన దిశగా పయనించాలని అన్నారు. మన ప్రజల సర్వతోముఖాభివృద్ధి కృషి చేయాలని వెంకయ్య పేర్కొన్నారు.

"మనకు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లవుతున్న సందర్భంగా.. అందరూ ఓటు వేసేలా సంకల్పించుకుందాం. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కనీసం 75 శాతానికి ఓటింగ్​ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందాం. ఓటు హక్కు మాత్రమే కాదు.. బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించండి" వెంకయ్య తన సందేశంలో తెలిపారు.

ఇదీ చూడండి:పార్టీల 'ఉచిత' హామీలపై కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

Last Updated : Jan 25, 2022, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details