PM Modi Visits ISRO :చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ నిర్వహించి ఇస్రో అసాధారణ విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇస్రో సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. చంద్రయాన్-3 ద్వారా అంతరిక్షంలో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయాన్ని ( Modi Meets ISRO Scientists ) సందర్శించిన మోదీ.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
"ప్రయోగం సమయంలో నేను దక్షిణాఫ్రికాలో ఉన్నా. కానీ నా మనసంతా చంద్రయాన్-3 విజయంపైనే ఉంది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను భారత్ సృష్టించింది. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించాం. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నా."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటనను ముగించుకొని బెంగళూరు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ఇస్రో కార్యాలయానికే వెళ్లారు. చంద్రయాన్-3 ప్రాజెక్టును విజయవంతం చేసిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ & కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ (TTCNMCC) కార్యాలయానికి రోడ్‌షోగా వెళ్లిన ఆయనకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఇతర శాస్త్రవేత్తలు స్వాగతం పలికారు. అనంతరం మోదీకి చంద్రయాన్-3 గురించి వివరాలు తెలియజేశారు. ల్యాండర్, రోవర్ ఎలా పనిచేస్తాయనే విషయాలను మోదీకి.. సోమనాథ్ వివరించారు. శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలను ప్రధాని ఆసక్తిగా విన్నారు. వారిని పలు ప్రశ్నలు అడిగి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 ల్యాండర్ తీసిన తొలి ఫొటోను మోదీకి బహూకరించారు సోమనాథ్.
అంతకుముందు బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన మోదీకి స్థానికులు భారీగా స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌ను విశ్వసించే ప్రతిఒక్కరూ చంద్రయాన్-3 విజయంతో ముగ్ధులయ్యారని అన్నారు. చంద్రయాన్-3 విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిఒక్కరినీ గర్వపడేలా చేశారని తెలిపారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ.. వారిని కలవకుండా ఉండలేకపోయానని చెప్పుకొచ్చారు. అందుకే భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత మొదట శాస్త్రవేత్తల వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టుకు వచ్చినవారితో 'జై జవాన్- జై కిసాన్, జై విజ్ఞాన్- జై అనుసంధాన్' నినాదాలు చేయించారు.