భారత 15వ రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ద్రౌపదీ ముర్ము నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఆమె నివాసానికి వెళ్లిన మోదీ.. పుష్పగుఛ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. 130 కోట్ల భారతీయులు 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలు జరుపుకొంటున్న ఈ తరుణంలో.. ఓ ఆదివాసీ, గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికవడం ఆనందంగా ఉందన్నారు మోదీ. ఝార్ఖండ్ గవర్నర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ముర్ము శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యాంగ సంరక్షురాలిగా ఎలాంటి పక్షపాతాలు, భయాలు లేకుండా పనిచేయాలని ఆకాంక్షించారు. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠంపై కూర్చోవడం.. ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమన్నారు. భారతదేశం గర్వించేలా ద్రౌపదీ ముర్ము పనిచేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మరోవైపు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం వల్ల ఆమె ఇంటి వద్ద సంబరాలు హోరెత్తాయి. ఆమె ఇంటి వద్ద ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో వేడుకలు చేసుకుంటున్నారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నూతనంగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అనుభవం, నిస్వార్థ సేవా స్ఫూర్తి, ప్రజా సమస్యలపై లోతైన అవగాహన దేశానికి ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు.