PM Modi Vande Bharat Inauguration :భారతీయ రైల్వేలో మెరుగైన సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు.. దేశంలో అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసే రోజు దగ్గర్లోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వందే భారత్ రైళ్లకు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. ఇప్పటివరకు ఈ రైళ్లలో 1,11,00,000 మంది ప్రయాణించారని వెల్లడించారు. ఇప్పటికే దేశంలో 25 వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా.. తాజాగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో నడిచే కాచిగూడ- యశ్వంత్‌పుర్, విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఉన్నాయి.
'ఒకరోజు రైళ్ల ప్రయాణికుల సంఖ్య.. ఆ దేశాల జనాభా కంటే ఎక్కువ'
భారత్లో ఒక రోజు రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య.. అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ అని ప్రధాని మోదీ తెలిపారు. "దేశంలో గత కొన్నేళ్లుగా పలు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి నిలిచిపోయింది. ఇది చాలా దురదృష్టకరం. మేము అధికారంలోకి వచ్చాక రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. నేడు ప్రారంభించిన రైళ్లు.. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, బంగాల్, కేరళ, ఒడిశా, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తాయి" అని మోదీ వివరించారు.
'ఆ విజయాల పట్ల భారతీయులు ఎంతో గర్వంగా..'
140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవలే భారత్ సాధించిన విజయాల పట్ల దేశ ప్రజలంతా ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. చంద్రయాన్-3 విజయంతో సామాన్యుల అంచనాలు ఆకాశాన్ని తాకాయని మోదీ వ్యాఖ్యానించారు.