Modi Uttarakhand Visit: గతంలో కేంద్రం, ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందడుగు వేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్ర ప్రగతి కోసం వారెప్పుడూ పని చేయలేదని విమర్శించారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న మోదీ.. హల్ద్వానీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
"భాజపా సర్కారుకు ముందు అధికారంలో ఉన్నవారు ప్రాజెక్టును జాప్యం చేయడం పాపం కాదా? మీరు వారి పాపాన్ని మరచిపోతారా?" అని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధే అజెండాగా 'సబ్కా సాత్, సబ్కా వికాస్' నినాదంతో ముందుకెళ్తోందన్నారు.
రూ.17వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన
ఉత్తరాఖండ్‌లో పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు. వాటిలో రూ.14,127 కోట్ల విలువైన 17 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరో రూ.3,420 కోట్ల వ్యయంతో ఇటీవల పూర్తి చేసిన ఆరు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరచునున్నట్లు మోదీ తెలిపారు.