ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ (Kalyan Singh death) నివాసానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi). కల్యాణ్‌సింగ్ భౌతికకాయం ముందు పుష్పగుచ్ఛం ఉంది నివాళులు అర్పించారు. జనకల్యాణమే మంత్రంగా కల్యాణ్ ముందుకెళ్లారని ప్రధాని గుర్తుచేసుకున్నారు. యూపీ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని ప్రశంసించారు. సరైన పాలన, నిజాయతీకి నిదర్శనం కల్యాణ్ సింగ్ అన్నారు మోదీ.
విలువైన నాయకుడు..
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ విలువైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఆయన 'నమ్మకానికి గుర్తు' అంటూ అభివర్ణించారు. కల్యాణ్‌సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత మోదీ మీడియాతో మాట్లాడారు.
" దేశం ఓ విలువైన, సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయింది. ఆయన ఆశయాలను, కలలను నెరవేర్చేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. తనమొత్తం జీవితాన్ని దేశప్రజలకు అంకితం చేశారు. కల్యాణ్ సింగ్.. జన కల్యాణమే మంత్రంగా పనిచేశారు. తన జీవితకాలం మొత్తం భాజపా, భారతీయ జన్‌సంఘ్ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. ప్రజాసంక్షేమం కోసం కల్యాణ్‌సింగ్ పనిచేశారు. ఆ శ్రీరాముడు.. కల్యాణ్ సింగ్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.''
-- నరేంద్ర మోదీ, ప్రధాని