PM Modi Foreign Visit 2022: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా మే 2 నుంచి 4 వరకు యూరప్‌లోని జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాలను సందర్శించనున్నారు. 2022లో ఇదే ప్రధానికి తొలి విదేశీ పర్యటన అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
తొలుత బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు మోదీ. వీరిద్దరూ భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో ఎడిషన్‌కు సహ అధ్యక్షులుగా ఉన్నారు. 2021లో జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరువురు దేశాధినేతలు సమావేశం కానుండడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల అనంతరం జర్మనీలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ.
ఆ తర్వాత డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్‌హాగన్‌కు వెళతారు. డెన్మార్క్ వేదికగా జరగనున్న ఇండియా- నార్డిక్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పులు, ఆవిష్కరణలు, సాంకేతికత, పునరుత్పాదక ఇంధన అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అనంతరం భారత్- డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొననున్న మోదీ.. ప్రవాస భారతీయలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఐస్లాండ్ ప్రధాన మంత్రి కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్, నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్, స్వీడన్ ప్రధాని మాగ్డలీనా ఆండర్సన్, ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్‌తోనూ మోదీ సమావేశం కానున్నారు. మే 4న తిరుగు ప్రయాణంలో.. ప్రధాని కొద్దిసేపు పారిస్‌లో ఆగి నూతనంగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను కలవనున్నారు.
ఇదీ చదవండి:భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్- ఆ రాష్ట్రాలకు నిఘా విభాగం హెచ్చరిక