బంగాల్లోని ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసర్చ్ కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అలాగే.. ఐఐటీ ఖరగ్‌పుర్ 66వ స్నాతకోత్సవంలో మధ్యాహ్నం 12.30 గంటలకు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించింది.
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసర్చ్ కేంద్రం ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. కేంద్ర విద్యాశాఖ సహకారంతో దీనిని ఐఐటీ ఖరగ్‌పుర్ ఏర్పాటు చేసింది. శాస్త్రీయ, సాంకేతిక, నూతన ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెంచి పరిశోధనల్లో భారత్‌ను మేటిగా నిలపాలనే ప్రధాని మోదీ విజన్లోనిదే ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేర్కొంది పీఎంఓ. దానిని ఆరోగ్య రంగం, సాంకేతికతల మధ్య ఉత్పన్నమైన శక్తిగా కొనియాడింది.