భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో నేడు సమావేశం కానున్నారు. వర్చువల్‌గా జరిగే సదస్సులో వీరిరువురు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల సంబంధాల బలోపేతం కోసం పదేళ్ల రోడ్‌మ్యాప్‌ను విడుదల చేయనున్నారు.
బహుముఖ వ్యూహాత్మక సంబంధాలను పెంచేందుకు ఈ సదస్సు ఓ ముఖ్యమైన అవకాశంగా నిలుస్తుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పరస్పర అవగాహన ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సహకారం కోసం ఈ భేటీ ఉపయోగపడుతుందని వెల్లడించింది.
5 అంశాలపై దృష్టి
ఈ భేటీలో దేశాధినేతలు విడుదల చేసే 'రోడ్‌మ్యాప్ 2030'తో ఐదు కీలక అంశాల్లో ఇరుదేశాల సహకారం మరింత బలపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఐదు రంగాలను.. వాణిజ్యం, రక్షణ-భద్రత, వాతావరణ సమస్యలు, వైద్యం, ప్రజా సంబంధాలుగా వివరించింది.
భారత్, బ్రిటన్ మధ్య 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాజా సదస్సు ఓ ముఖ్యమైన అవకాశమని తెలిపింది. కరోనా కట్టడిలో సహకారంపైనా ఇరువురు దేశాధినేతలు చర్చిస్తారని వెల్లడించింది.
ఇదీ చదవండి:పుదుచ్చేరిలో సీఎం సీటుపై భాజపా కన్ను!