వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారుల కృషి వల్లే వ్యాక్సినేషన్లో దేశం ఈ స్థాయిలో పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జిల్లా అధికారుల నుంచి.. ఆశావర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ టీకా పంపిణీ కోసం పాటు పడ్డారని కొనియాడారు. వ్యాక్సినేషన్ కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం (Modi meeting today) నిర్వహించిన ఆయన... 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహిస్తే.. మరో సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం (Modi news today) ఉందన్నారు.
వ్యాక్సిన్ పంపిణీలో అపోహలు, పుకార్ల రూపంలో సవాళ్లు ఎదురవుతాయని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత మందికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం స్థానిక మతపెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు. గ్రామ, పట్టణాల స్థాయిలో వినూత్న పద్ధతులు పాటించి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు ఇవ్వాలని అధికారులకు ప్రధాని నిర్దేశించారు. రెండు డోసుల రక్షణ పొందనివారిని గుర్తించాలని చెప్పారు.
"వ్యాధులను, శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చివరి వరకు మనం పోరాడాలి. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఇది(కొవిడ్19) వందేళ్లలో అతిపెద్ద మహమ్మారి. దీని వల్ల దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనాపై పోరాడేందుకు కొత్త పరిష్కారాలు కనుక్కోవడం చాలా గొప్ప విషయం. మీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కవరేజీ పెంచేందుకు మీరు కూడా వినూత్న పద్ధతులను పాటించాలి. అవసరమైతే గ్రామ, పట్టణాల స్థాయిలో 20-25 మందితో బృందాలు ఏర్పాటు చేయవచ్చు. వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూడొచ్చు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి.. సురక్షితంగా టీకాలు ఇచ్చారు. ఇప్పుడు 'హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా'(ఇంటింటికి టీకా) స్ఫూర్తితో ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు ఇవ్వండి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.