First Solar Village Of India: దేశంలో తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలోని మొఢేరా ఆవిష్కృతం కానుంది. ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ గ్రామంలోని చారిత్రక సూర్య దేవాలయంలో విద్యుద్దీపాలంకరణ, 3డీ ప్రొజెక్షన్ అన్నీ ఇక సౌర విద్యుత్తుతోనే నడుస్తాయి. ప్రజలు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఈ విద్యుత్తు వెలుగులను చూడవచ్చు.
ఈ ఆలయ అభివృద్ధి, సౌర విద్యుత్తు ప్రారంభ కార్యక్రమాలకు ప్రధాని హాజరవుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రధాని కలల సాకారంలో గుజరాత్ ముందు వరుసలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ద్వారా దేశ విద్యుత్తు అవసరాలు 50 శాతం తీరాలన్న సంకల్పానికి తాము నిబద్ధులై ఉన్నట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషికి నిదర్శనం
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టం (బీఈఎస్‌ఎస్) ద్వారా స్థానిక సూర్య దేవాలయంతోపాటు మొఢేరా గ్రామ సౌర విద్యుదీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషికి నిదర్శనమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్ ప్రభుత్వం 18 ఎకరాల భూమి కేటాయించగా.. కేంద్ర, రాష్ట్ర సర్కారులు 50 - 50 నిష్పత్తితో రూ.80.66 కోట్ల నిధులను రెండు దశల్లో ఖర్చు చేశాయన్నారు. మొఢేరా గ్రామ ఆవాసాలపై 1 కిలోవాట్ సౌర పలకలు 1,300కు పైగా ఉచితంగా అమర్చినట్లు తెలిపారు.