PM Modi Speech On Independence Day 2023 :మణిపుర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శాంతి ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. మణిపుర్ ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం మణిపుర్‌తోనే ఉందన్నారు. అక్కడి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
"కొద్ది వారాలుగా ఈశాన్య రాష్ట్రాలలో ప్రధానంగా మణిపుర్‌లో హింస జరుగుతోంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి తల్లులు, కూతుళ్లు ఎంతగానో ఇబ్బంది పడ్డారు." అని మోదీ వ్యాఖ్యానించారు. మణిపుర్‌లో సంపూర్ణ శాంతి సంకల్పంతో చర్యలు సాగుతున్నాయన్నారు. కొన్ని సార్లు చరిత్రలో చిన్న సంఘటనలు దీర్ఘకాలిక విపరిణామాలకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించి.. చర్యలు చేపడితే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు.
వెయ్యేళ్ల బానిసత్వం తర్వాత భారత్ స్వాతంత్య్రం పొందిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్య్రం తర్వాత ఇప్పుడు కొత్త వెలుగులవైపు దేశం పయనిస్తోందని ఆయన తెలిపారు. వెయ్యేళ్ల భవిష్యత్తు సంధికాలంలో మనం నిలబడి ఉన్నామని.. వెయ్యేళ్ల భవిష్యత్తును కాంక్షించి మన కృషి, పట్టుదలతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. మన యువశక్తిలో సామర్థ్యం ఉందని.. వారిని బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ సిస్టమ్‌గా భారత్‌ను మన యువత నిలబెట్టిందన్నారు.
బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యమన్నారు మోదీ. ప్రతి సంస్కరణ జాతి జన క్షేమాన్ని కాంక్షించే జరుగుతున్నాయని వెల్లడించారు. సత్తాచాటు, మార్పుచెందు అన్న పద్ధతిలో దేశం ముందడుగు వేస్తోందని వివరించారు. ప్రతి సంస్కరణలోనూ ఒక పరమార్థం ఉందన్న మోదీ.. అందుకు జలశక్తి మంత్రిత్వశాఖ ఒక ఉదాహరణ అన్నారు. పర్యావరణహితంగా.. ప్రతి ఇంటికి శుద్ధ తాగునీరు అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో జీ20 సమావేశాలు దేశసామర్థ్యం, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాయని తెలిపారు. అవి ప్రపంచానికి కొత్త భారతాన్ని పరిచయం చేశాయని పేర్కొన్నారు.
పేద వర్గాల నుంచి వచ్చిన క్రీడాకారులు కూడా సమున్నత స్థానాలను అందుకున్నారన్నారు మోదీ. సొంత ఉపగ్రహాలను సైతం దేశ యువత కక్ష్యలోకి ప్రవేశపెడుతోందని గుర్తు చేశారు. ఆకాశమే హద్దుగా మన యువత అనేక రంగాల్లో సత్తా చాటుతోందని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో మన రైతుల కృషి సాటిలేనిదన్న ప్రధాని.. ప్రపంచానికి ఆహారధాన్యాలను అందించే స్థాయికి వారు ఎదిగారన్నారు. సాగు రంగంలో తెచ్చిన సంస్కరణలు రైతులకు లబ్ధి చేకూర్చాయని.. యూరియాపై రూ.10 లక్షల కోట్ల రాయితీ రైతులకు లాభిస్తోందని మోదీ వెల్లడించారు.