PM Modi Speech National Unity Day : వచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమైనవన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అమృతకాలంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాల్సి ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో మన లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఆర్టికల్ 370రద్దు చేయడం వల్ల.. జమ్ముకశ్మీర్ ప్రజలు ఉగ్రనీడ నుంచి బయటపడ్డారని మోదీ వ్యాఖ్యానించారు. భారత మొదటి హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా.. గుజరాత్‌లోని ఏక్తా నగర్లో ఉన్న ఆయన విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందన్నారు మోదీ. ఈ రోజు భారత్ కొత్త శిఖరాలను అందుకుందన్నారు. మనం జీ20 నిర్వహించిన తీరుతో ప్రపంచం ఆశ్చర్యానికి గురైందని మోదీ వెల్లడించారు. ప్రపంచంలో చాలా సంక్షోభాలు ఉన్నప్పటికీ.. భారత్ సరిహద్దులు మాత్రం సురక్షితంగానే ఉన్నాయని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని మోదీ ఆశాభావం వక్తం చేశారు. దేశంలో బుజ్జగింపు రాజకీయాలు చేయడంపై విమర్శలు గుప్పించారు.
"చంద్రయాన్ 3విజయం పట్ల మనమంతా గర్వపడాలి. తేజస్ యుద్ధ విమానాల వంటివి మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. ప్రపంచ స్థాయి క్రీడల్లో మన యువత చాలా పథకాలు సాధిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి అనవసర చట్టాలని తీసివేశాం. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత తీసుకువచ్చాం. సర్ధార్ పటేల్ మనకు స్పూర్తి." అని మోదీ పేర్కొన్నారు. చాలా దేశాలు తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయన్న మోదీ.. భారత్‌లో మాత్రం ఆ పరిస్థితులు లేవన్నారు.