బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాదిగ విరోధులు మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా PM Modi Speech at Madiga Vishwarupa Mahasabha: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి ప్రసంగం ప్రారంభించిన ప్రధాని.. సమ్మక్క, సారలమ్మలను గుర్తు చేసుకున్నారు. ఇది అణగారిన వర్గాల విశ్వరూప మహా సభ అని అభివర్ణించిన మోదీ.. మందకృష్ణ మాదిగ తన చిన్న తమ్ముడని పేర్కొన్నారు. ఎంతో ప్రేమతో ఈ సభకు తనను ఆహ్వానించారన్న ఆయన.. ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం, త్వరలో కమిటీ వేస్తాం : ప్రధాని మోదీ
ఈ సందర్భంగా స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారని మోదీ పేర్కొన్నారు. ఆ ప్రభుత్వాలకు, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. అనేది తమ విధానమన్న మోదీ.. సామాజిక న్యాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని.. మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని వెల్లడించారు. ఈ క్రమంలోనే పేదరిక నిర్మూలనే తమ ప్రథమ ప్రాధాన్యమన్న ఆయన.. మాదిగల బాధలు పంచుకునేందుకే తాను ఇక్కడకు వచ్చానన్నారు.
కంటతడి పెట్టిన మందకృష్ణ మాదిగను ఓదార్చిన ప్రధాని మోదీ
న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మాదిగలను వాడుకున్నాయని విమర్శించిన మోదీ.. మాదిగలంతా వన్ లైఫ్.. వన్ మిషన్‌లా పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. దళిత నేతను సీఎం చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం తెలంగాణ సంకట పరిస్థితిలో ఉందన్న ప్రధాని.. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడలేకపోయిందని ఆక్షేపించారు. దళితుల ఆశలపై నీళ్లు చల్లింది కేసీఆరే అని.. దళితబంధు పథకం వల్ల ఆ పార్టీ నేతలకు మాత్రమే మేలు జరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ.. అంబేడ్కర్‌ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడించిందని తెలిపారు. హస్తం పార్టీ.. పార్లమెంట్‌లో అంబేడ్కర్ చిత్రపటం కూడా పెట్టలేదని.. ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాకే అంబేడ్కర్ ఫొటో పెట్టామని.. భారతరత్న ఇచ్చామని గుర్తు చేశారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, దళిత బిడ్డ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత తమ పార్టీదే అని వెల్లడించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్.. అవినీతి పార్టీలని ప్రధాని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్‌తో కలిసి డ్రామాలు ఆడుతోందన్నారు. దిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో కలిసి అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. పేదవాళ్లు అభివృద్ధి చెందాలనేదే తమ నినాదమన్న ఆయన.. కేంద్ర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయని స్పష్టం చేశారు. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తానని మోదీ ప్రకటించారు.
మూడ్రోజుల పర్యటన కోసం ఈ నెల 25న తెలంగాణకు మోదీ - 27న హైదరాబాద్‌లో రోడ్ షో