PM Modi South Africa Visit :15వ బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు మంగళవారం ఉదయం దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశ రాజధాని జోహన్నెస్‌బర్గ్‌లో 22-24 మధ్య సమావేశం కానున్నాయి బ్రిక్స్ సభ్య దేశాలు. ఈ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. 2019 తర్వాత తొలిసారి ముఖాముఖిగా భేటీ అవుతున్నాయి. సభ్యదేశాల్లో ఒకటైన రష్యా.. ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేయడం, భారత్-చైనాల మధ్య పలు అంశాల్లో ఘర్షణ వాతావరణం, దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న సమయంలో ఈ సభ్యదేశాలన్నీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పుతిన్ డుమ్మా
BRICS Summit 2023 South Africa : అయితే, ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వ్యక్తిగతంగా పాల్గొనడం లేదని దక్షిణాఫ్రికా ఇటీవలే వెల్లడించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ ఉండటం.. దక్షిణాఫ్రికాకు వెళ్తే అరెస్టు తప్పదనే భయంతో పుతిన్ సమావేశానికి దూరంగా ఉన్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు మినహా.. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
జిన్‌పింగ్‌తో భేటీ అవుతారా?
Xi jinping Modi Meet : మరోవైపు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. ద్వైపాక్షిక చర్చల షెడ్యూల్‌పై ప్రస్తుతం ఖరారు చేస్తున్నామని చెప్పారు. చివరిసారిగా గతేడాది నవంబర్‌లో బాలి (ఇండోనేసియా)లో జరిగిన జీ20 సదస్సులో మాట్లాడుకున్నారు ఇరువురు నేతలు. అంతకుముందు ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నా ఇద్దరు నేతలు మాత్రం పలకరించుకోలేదు.
"మేము సానుకూల ధృక్పథంతో ఉన్నాం. బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చుకోవాలనే అంశంపై విధివిధానాలపై చర్చిస్తాం. బ్రిక్స్‌లో చేరడానికి అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే 23 దేశాలు దరఖాస్తు చేశాయి. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి బలమైన దేశాలు చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయి."