Mercedes Maybach S650 cost: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు ఉపయోగించే కారు ఖరీదు రూ.12 కోట్లు అని వచ్చిన వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. 'మెర్సిడీస్ మేబాక్ ఎస్-650 గార్డ్' విలువ... వార్తల్లో వచ్చిన దానిలో మూడో వంతే(సుమారు రూ.4 కోట్లు) ఉంటుందని తెలిపాయి. మోదీ ఇదివరకు ఉపయోగించే కార్ల తయారీని బీఎండబ్ల్యూ సంస్థ నిలిపివేయడం వల్ల తాజా మోడల్‌ను ఆయన రక్షణ కోసం ప్రవేశపెట్టినట్లు వెల్లడించాయి.
SPG Modi security
సాధారణ రీప్లేస్మెంట్లో భాగంగానే కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకుందని.. ఇందులో మోదీ ప్రమేయం లేదని చెప్పాయి.
"మీడియాలో వచ్చిన దానికంటే కారు ఖరీదు చాలా తక్కువ. నిజానికి మీడియాలో ప్రచారమైనదానికి మూడో వంతే ఉంటుంది. ప్రతి ఆరేళ్లకోసారి ఈ వాహనాలను మార్చాలని ఎస్పీజీ నిబంధనల్లో ఉంది. ఇదివరకు కార్లను మోదీ ఎనిమిదేళ్ల పాటు ఉపయోగించారు. కార్ల ఆడిట్ సమయంలో అభ్యంతరాలు తలెత్తాయి. రక్షణ పొందే వ్యక్తి(ప్రధాని) ప్రాణాలకు ఉన్న ముప్పును బట్టి కొత్త వాహనాల కొనుగోలు ఉంటుంది. ఈ నిర్ణయం రక్షణ పొందే వ్యక్తితో సంబంధం లేకుండా ఎస్పీజీ స్వతంత్రంగా తీసుకుంటుంది."
-ప్రభుత్వ వర్గాలు