తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''ఐదేళ్లు చేస్తాం.. వెళ్లిపోతాం' అంటే కుదరదు'.. ఆ రాష్ట్రాలకు మోదీ వార్నింగ్! - modi latest news

పలు రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రాలు చెల్లించాల్సిన విద్యుత్‌ వినియోగ బకాయిలు భారీగా పెరిగినట్లు పేర్కొన్న మోదీ.. సాధ్యమైనంత త్వరగా వాటిని చెల్లించాలని కోరారు. ఇది రాజకీయం కాదని... దేశ నిర్మాణానికి సంబంధించి అంశమని మోదీ స్పష్టంచేశారు.

MODI POWER BILLS
MODI POWER BILLS

By

Published : Jul 30, 2022, 10:55 PM IST

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన 'ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్- పవర్@2047' ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, వివిధ పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామగుండంలో నిర్మించిన 100మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను, కేరళలోని 92మెగావాట్ల సోలార్ ప్లాంటును మోదీ జాతికి అంకితం చేశారు. రాజస్థాన్‌లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు, లేహ్‌లోని గ్రీన్‌ హైడ్రోజన్‌ మొబిలిటీ ప్రాజెక్టుకు,గ్రీన్ హైడ్రోజన్‌ను సహజవాయువుతో బ్లెండింగ్‌చేసేందుకు గుజరాత్‌లో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై హిమచల్ ప్రదేశ్ , త్రిపుర, విశాఖపట్నం, ఉత్తర్ ప్రదేశ్ , గుజరాత్ వాసులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మాట్లాడారు. వన్ నేషన్‌, వన్‌ గ్రిడ్‌ దేశానికి బలంగా మారిందన్నారు. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని మోదీ ఆరోపించారు.

"తర్వాత వచ్చేవారు చేస్తారు. మాకేముంది. ఐదేళ్లలో మేము చేసేది చేసుకొని వెళ్తాం అనుకుంటున్నారు. దేశ అభివృద్ధికి ఇలాంటి భావన ప్రయోజనం చేకూర్చదు. ఈ ఆలోచన వల్లే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని విద్యుత్ వ్యవస్థ సంకటస్థితిలో ఉంది. ఏదైనా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ బలహీనపడితే ఆ ప్రభావం దేశం మొత్తం పడుతుంది. ఆ రాష్ట్ర భవిష్యత్‌ను కూడా అంధకారంలోకి నెడుతుంది."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

దేశంలోని వివిధ రాష్ట్రాలు చెల్లించాల్సిన విద్యుత్‌ వినియోగ బకాయిలు భారీగా పెరిగినట్లు పేర్కొన్న ప్రధాని మోదీ.. సాధ్యమైనంత త్వరగా వాటిని చెల్లించాలని కోరారు. ఇది రాజకీయం కాదని... దేశ నిర్మాణానికి సంబంధించి అంశమని మోదీ స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details