రాజకీయ లబ్ధి కోసం కొందరు.. భారత రాజ్యాంగ సంస్థలను కించపరచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతిపక్షాలనుద్దేశించి.. వారు దేశంలోని మెజారిటీ ప్రజల ఆలోచనలను ప్రతిబింబించకపోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.
భగవద్గీత శ్లోకాలపై 21 మంది పండితుల వ్యాఖ్యానాలతో 11 సంపుటాల లిఖిత పుస్తకాలను విడుదల చేశారు మోదీ. స్వాతంత్ర్యోద్యమానికి గీత కొత్త ఉత్తేజాన్ని, ప్రజలకు సమాన హక్కలను ఇచ్చిందని పేర్కొన్నారు.
అదే సమయంలో విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
"రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠ, విశ్వసనీయత దెబ్బతీయడానికి కొందరు నిరంతరం యత్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్, న్యాయస్థానాలు.. చివరికి సైన్యాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది దేశానికి ఎంతో హానికరం. అయితే అదృష్టవశాత్తు దేశంలోని మెజారిటీ ప్రజల ఆలోచనలను వీరు ప్రతిబింబించడం లేదు. ప్రస్తుతం దేశం తన కర్తవ్యాలపై దృష్టిసారించి ముందుకు సాగుతోంది. భగవద్గీత ప్రతిపాదించిన 'కర్మయోగ'ను దేశం మంత్రంగా మలుచుకుంది. దానిని అనుసరించి పేద, రైతు, కార్మిక, దళిత, వెనుకబడిన వారి జీవితాల్లో మార్పుకోసం శ్రమిస్తోంది."