Modi Independence day speech: అవినీతి, బంధుప్రీతి దేశం ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండిటిపై ప్రజలంతా పోరాడాలని స్పష్టం చేశారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. బంధుప్రీతి దేశానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు ఇవ్వాలని మోదీ అన్నారు. నూతన భారతదేశానికి ప్రతిభ మాత్రమే ఆధారమని చెప్పారు.
"బంధుప్రీతి, వారసత్వాల గురించి నేను మాట్లాడితే రాజకీయం గురించి ప్రస్తావిస్తున్నా అని అనుకుంటారు. కానీ, దురదృష్టవశాత్తు ఈ కుటుంబ రాజకీయాలే ప్రతి రంగంలో బంధుప్రీతిని పెంచిపోషించాయి. వీటన్నింటిని మార్చాలంటే ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు రావాలి. ఎవరైతే అర్హులు ఉంటారో వారికే అవకాశాలు దక్కాలి."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మరోవైపు, అవినీతిపైనా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని ప్రచారం చేసేవారిని శిక్షించాలని అన్నారు. 'అవినీతిని చూసి దేశం కోపగించుకుంటోంది తప్ప అవినీతిపరులను కాదు. ఈ తీరు మారాలి. అవినీతి చేసిన వ్యక్తులనూ శిక్షించాలన్న భావన ఏర్పడితేనే దేశం వేగంగా పురోగతి సాధిస్తుంది. మన సత్తా అంతా కూడగట్టుకొని అవినీతిపై పోరాడాలి. ఈ విషయంలో మేం సఫలమయ్యాం. ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ, మొబైల్ ఫోన్లు ఉపయోగించి గడిచిన ఎనిమిదేళ్లలో రూ.2లక్షల కోట్ల నల్లధనాన్ని గుర్తించాం' అని మోదీ పేర్కొన్నారు.
'మహిళలను గౌరవించాలి'
మహిళలను అందరూ గౌరవించాలని మోదీ దేశ ప్రజలకు సూచించారు. ఏ ఒక్కరూ మహిళల గౌరవం భంగం కలిగేలా ప్రవర్తించకూడదని హితవు పలికారు. 'నారీ శక్తి'కి ప్రజలంతా మద్దతు పలకాలని అన్నారు. మహిళలను అవమానించడం సబబేనన్న ప్రవర్తన నుంచి బయటపడాలని స్పష్టం చేశారు. ఇందుకోసం అందరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. 'ఐక్యభారతం ప్రపంచానికి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది. కుటుంబ నిర్మాణం నుంచే జాతి ఐక్యత ఏర్పడుతుంది. ఐక్య భారతంలో లింగసమానత్వం కీలక అంశం. కుటుంబాలలో కుమారులు, కుమార్తెలకు సమాన ప్రాధాన్యం ఇవ్వకపోతే.. ఐక్యత అనే ఆలోచనే ప్రమాదంలో పడుతుంది. ఇంట్లోనూ ఐక్యభావంతో మెలగాలి. అన్ని స్థాయిలలో వివక్ష పూర్తిగా సమసిపోవాలి' అని మోదీ అన్నారు.