తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవినీతి, కుటుంబ పాలనను ఏరిపారేయాలి, సవాళ్లున్నా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి - మోదీ ఇండిపెండెన్స్ డే స్పీచ్

స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ ఆత్మనిర్భర్ భారతావని లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శతాబ్ది వేడుకలు జరుపుకునే నాటికి స్వయంసమృద్ధ దేశంగా అవతరించాల్సిందనేని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చిచెప్పారు. అందుకోసం రాష్ట్రాల మధ్య పోటీ మరింత పెరగాలన్న మోదీ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, కుటుంబపాలన అనే చీడపురుగులను ఏరిపారేయాలన్న ఆయన.. ఆ దిశలో సమర్థంగా పనిచేసేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో అభ్యర్థించారు.

pm-modi-red-fort-speech-2022-
pm-modi-red-fort-speech-2022-

By

Published : Aug 15, 2022, 2:17 PM IST

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ

PM Modi Independence day speech: భారతదేశ 76వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకోటపై వరుసగా తొమ్మిదోసారి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఉదయం రాజ్​ఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించి, ఎర్రకోటకు చేరుకున్న ఆయన.. భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలు నవచేతనతో ముందడుగు వేస్తున్నారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు.

త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తున్న మోదీ
మహాత్ముడికి ప్రధాని నివాళులు

"సమాజం ఆకాంక్షలతో నిండి ఉన్నప్పుడు ప్రభుత్వాలు మెడపై కత్తి పెట్టినట్లు పనిచేయాల్సి ఉంటుంది. కాలంతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. కేంద్రమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. చాలా దశాబ్దాల అనుభవాన్ని చూసిన తర్వాత స్థిరమైన ప్రభుత్వం గొప్పతనం ఏంటి, రాజకీయ సుస్థిరత ద్వారా ప్రపంచంలో ఎలాంటి శక్తిని చూపవచ్చు, విధానాలు ఎంత శక్తిమంతంగా ఉంటాయి, వాటిపై ప్రపంచానికి ఎలాంటి విశ్వాసం కలుగుతుందో ప్రస్తుతం భారత్‌ చేసి చూపింది. ఈ విషయాన్ని యావత్‌ ప్రపంచం అర్థం చేసుకుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఐదు తీర్మానాలు
PM Modi Red Fort speech 2022: జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ వచ్చే 25ఏళ్లలో భారత్‌ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి జరగాలని ప్రధాని సూచించారు. ఇందుకోసం ఐదు తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రజలంతా వీటిపైనే తమ శక్తినంతా కేంద్రీకరించాలని పిలువునిచ్చారు.

ప్రజలకు అభివాదం
ప్రధానికి సైనికుల వందనం
ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్న ప్రధాని

"పంచప్రాణాల్లో మొదటిది దేశాభివృద్ధి. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. రెండోది మనలో ఏదో ఒకమూల దాగి ఉన్న బానిసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయడం. మూడో ప్రాణ శక్తి.. మన వారసత్వ సంపద పట్ల గర్వపడడం. నాలుగో ప్రాణశక్తి.. ఐక్యత-కలిసికట్టుగా ఉండడం. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా ఉండాలి. ఐదో ప్రాణశక్తి ప్రజల బాధ్యత. ఇందులో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికీ మినహాయింపు ఏమీ లేదు. వారు కూడా ప్రజలే. వచ్చే 25 ఏళ్లలో మన స్వప్నాలను సాకారం చేసుకునేందుకు ఇవి మనకు శక్తినిస్తాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'ఆత్మనిర్భర్'.. జన ఉద్యమం
Modi speech independence day:ఆత్మనిర్భర్ భారత్ అన్నది ఒక నినాదం కాదన్న ప్రధాని.. ఇది ప్రజాఉద్యమంగా సాగాలని ఆకాంక్షించారు. 'స్వదేశీకరణ నుంచి స్వరాజ్యం, స్వరాజ్యం నుంచి సుపరిపాలన. వీటిపై మనమంతా ఆలోచించాలి. మనం ఇంకా ఎంత కాలం విదేశాలపై ఆధారపడాలి. మనకు ఆహారం అవసరం ఉంటే దానిని ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తాం. మన కడుపు మనమే నింపుకోవాలన్న సంకల్పాన్ని సాకారం చేసుకున్నామా లేదా? సంకల్పం తీసుకుంటే సాధించి తీరుతాం. ఆత్మనిర్భర్ భారత్‌ అనేది ప్రభుత్వ అజెండా లేదా ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది ప్రజా ఉద్యమం. ఈ దిశలో మనం ముందుకెళ్లాలి. 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎర్రకోటపై నుంచి జాతీయజెండాకు దేశీయంగా తయారుచేసిన తుపాకీ ద్వారా సెల్యూట్‌ చేశాం. ఆత్మనిర్భర్ భారత్‌ ద్వారా ప్రపంచ అవసరాలను కూడా మనం తీర్చాలి' మోదీ పేర్కొన్నారు.

మోదీ
కళాకారుల మధ్య మోదీ
కళాకారులకు ప్రధాని అభినందన

అభివృద్ధి కోసం వైరుధ్యాలను పక్కనబెట్టి..
సహకార, సమాఖ్య విధానాల్లో కేంద్ర, రాష్ట్రాలు కలిసి నడవాలన్న ప్రధాని.. అభివృద్ధిలో రాష్ట్రాలు పరస్పరం పోటీపడాలని కోరారు. రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి అభివృద్ధిలో ఏకోన్ముఖం కావాలని విజ్ఞప్తి చేశారు. 'దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లడంలో అనేక రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. చాలా క్షేత్రాల్లో మంచి పనుల ద్వారా నేతృత్వం వహించాయి. ఇది మన సహకార సమాఖ్య వ్యవస్థకు శక్తినిస్తుంది. ప్రస్తుతం సహకార సమాఖ్య వ్యవస్థతోపాటు సహకార పోటీ సమాఖ్య వ్యవస్థ అవసరం కూడా ఉంది. అభివృద్ధి విషయంలో పోటీ పడాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు పోటీ పడాలి' అని మోదీ అన్నారు.

సంప్రదాయ వేషధారణలో, భారతదేశ చిత్రపటం ఆకారంలో కూర్చున్న వివిధ రాష్ట్రాల ప్రజలు
ప్రధాని మోదీ

'అవినీతి రూపుమాపాలి'
భారత్‌ను అవినీతి, వారసత్వ రాజకీయాలు పీడిస్తున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అమృత కాలంలో అవినీతి, కుటుంబపాలనను అంతమొందించే దిశగా పనిచేయాలన్నారు.

మోదీ
మోదీ

"భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఒకవైపు ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. వారు ఉండడానికి చోటు కూడా లేదు. మరోవైపు ఉన్న వారికి.. వారు దోచుకున్న డబ్బును దాచుకోవడానికి చోటు సరిపోవడం లేదు. దేశంలో అవినీతిపై అవగాహన కనిపిస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో అవినీతిపరుల పట్ల ఉదారత కూడా పెరిగిపోతోంది. చాలామంది ఎంత నిస్సుగ్గుగా తయారయ్యారంటే.. అవినీతి నిరూపితమైనా, జైలుకు వెళ్లేందుకు సిద్ధమైనా సరే వారిని గొప్పవారిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి, అవినీతిపరులను వివక్షతో చూడనంతవరకూ ఈ మానసిక స్థితిలో మార్పురాదు. కుటుంబ, వారసత్వ పాలకులు దేశానికి చాలా ఎక్కువ అన్యాయం చేశారు. అందువల్ల మనం కుటుంబవాద మానసిక ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలి. యోగ్యత ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత కాలంలోనూ మహిళల పట్ల వివక్ష ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్న మోదీ.. లింగ సమానత్వం ఆవశ్యకతను గుర్తుచేశారు. 'కారణాలేవైనా మనందరిలో ఒక వికృతమైన భావన నెలకొంది. మన ఆచార వ్యవహారాలు, మాటల్లో మహిళలను అవమానిస్తున్నాం. మన నిత్యజీవితంలో మహిళను అవమానించే మాట తీరు నుంచి బయటపడాలనే సంకల్పం తీసుకోలేమా? మన స్వప్నాలను సాకారం చేసుకోవడంలో మహిళా గౌరవం కీలక భూమిక పోషిస్తుంది. ఈ విషయాన్ని నేను గమనిస్తున్నాను. అందుకే ఈ విషయాన్ని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నాను' అని మోదీ పేర్కొన్నారు. 130 కోట్ల మంది ప్రజలు టీమిండియాగా కలిసి నడుస్తూ.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదామనే సంకల్పం తీసుకోవాలని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

ABOUT THE AUTHOR

...view details