'అమృతగాథ' పుస్తకం ఆవిష్కరించిన మోదీ.. ఈనాడుపై ప్రశంసలు భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక కథనాలను.. తెలుగు పాఠకుల అభిమాన పత్రిక 'ఈనాడు' సంకలనం చేసింది. యోధుల వీరగాథలతో సంకలనం చేసిన "అమృతగాథ" పుస్తకాన్ని, ఇవే కథనాలతో ఆంగ్లంలో తీర్చిదిద్దిన "ది ఇమ్మోర్టల్ సగా" పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో అరగంట పాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి.. ఈనాడు ఎండీ సీహెచ్. కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి హాజరయ్యారు.
ప్రధాని చేతుల మీదుగా పుస్తకావిష్కరణ అమృత గాథ పుస్తకాన్ని విడుదల చేసిన ప్రధాని చరిత్రకెక్కని ఎందరో వీరుల ధీరత్వాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఈనాడు చేసిన ప్రయత్నం అద్భుతమని మోదీ కొనియాడారు. ఈ ప్రయత్నం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
"భారత దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో ఇలాంటి ప్రయత్నాలు ఎంతో అవసరం. విస్తృత స్థాయిలో జనభాగస్వామ్యమే మన స్వాతంత్ర్య సంగ్రామం గొప్పతనం. భారత దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వీరులు ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి వారి గాథల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరైన ప్రయత్నాలు జరగలేదు. ఈ క్రమంలో ఈనాడు గ్రూప్ చేసిన ప్రయత్నం అసాధారణం."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
స్వాతంత్ర్య సమరయోధుల గురించి ప్రజలకు మరింతగా తెలిసేలా చేసేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. దేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావుతో తనకు ఉన్న సన్నిహిత బంధం గురించి కిరణ్, శైలజ, విజయేశ్వరితో సుదీర్ఘంగా మాట్లాడారు ప్రధాని. రామోజీ రావుకు, తనకు మధ్య జరిగిన సంభాషణల్ని గుర్తు చేసుకున్నారు. సమాజ సేవ, జాతి నిర్మాణంలో రామోజీ రావు భాగస్వామ్యం ఎనలేనిదని ప్రధాని కొనియాడారు.
మోదీతో కిరణ్, శైలజ, విజయేశ్వరి మోదీతో కిరణ్, శైలజ, విజయేశ్వరి ఏడాది పాటు ప్రత్యేక కథనాలు..
స్వాతంత్ర్య పోరాట ఘట్టాలపై ఏడాదిపాటు నిరంతరాయంగా ఈనాడులో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు మొక్కవోని దీక్షతో సాగిన స్వాతంత్ర్యోద్యమ చరిత్రను ఈనాడు పూసగుచ్చింది. మాతృభూమి స్వేచ్ఛ కోసం అలుపెరగక సాగిన పోరాటాలు, యోధానుయోధుల భాగస్వామ్యం, చరిత్రను మలుపు తిప్పిన మహాద్భుత ఘట్టాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో అఖండ భారతాన్ని మమేకం చేసిన తీరును కళ్లకు కట్టింది. చరిత్ర చీకట్లలో మిగిలిపోయిన వీరులు- వీరాంగనల గుండెచప్పుళ్లు, జాతికోసం తమ జీవితాలను ఆనందంగా అర్పించిన త్యాగధనుల మధుర దరహాసాలు, పేగు బంధం లేకపోయినా భరతభూమితో అనుబంధాన్ని పెంచుకుని మన వెన్నంటి నిలిచిన విదేశీ బంధుమిత్రుల జీవరేఖలను గుదిగుచ్చింది. అలాంటి అమరవీరుల అడుగుజాడలు కాలకడలి అలల్లో అదృశ్యం కాకుండా, భవిష్యత్తు భారతం కోసం వారు చిందించిన రక్తాశ్రువులు మన స్మృతిపథం నుంచి చెరిగిపోకుండా, చిరస్మరణీయ స్వాతంత్ర్య సమరయోధులను నవతరానికి చేరువ చేసేందుకు.. 2021 ఆగస్టు 15 నుంచి 2022 ఆగస్టు 15 వరకు వరుస కథనాలు అందించింది. సంవత్సరం పొడవునా 4 సెలవు రోజులు మినహా... రోజుకొకటి చొప్పున మొత్తం 362 ప్రత్యేక కథనాలను పాఠలోకానికి అందించింది. వీటికి అదనంగా 2021 ఆగస్ట్ 15, 2022 జనవరి 26, 2022 ఆగస్ట్ 15న.. అమృతోత్సవాలపై ప్రత్యేక సంచికలు వెలువరించింది. స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, పోరాట ఘట్టాలు, వీరగాథలను ఇప్పటి తరానికి తెలియజేసి... వారిలో స్ఫూర్తి నింపేందుకు కృషి చేసింది.