PM Modi Rajasthan Rally : ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల రాజస్థాన్‌లో కలకలం రేపిన 'రెడ్ డైరీ'లోని రహస్యాలు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాయని అన్నారు. రెడ్ డైరీ అనేది కాంగ్రెస్ 'దోపిడీ బజార్' తాజా ఉత్పత్తి అని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని.. పరీక్షా పత్రాల లీక్‌లో భాగస్వామిగా ఉందని ఆరోపించారు. యువత కలలు నెరవేరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనన్నారు. ప్రధాని మోదీ మరోసారి ప్రతిపక్ష కూటమి 'ఇండియా'పై కూడా విమర్శలు చేశారు.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర అనే నినాదం నడిచింది. ప్రస్తుతం యూపీఏ అంటే ఇండియా.. ఇండియా అంటే యూపీఏగా మారిపోయింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం 'కమలం గెలుస్తుంది, కమలం వికసిస్తుంది' అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇండియా పేరును ఉపయోగించి ప్రజలను తప్పుదారి పట్టించలేవు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇండియా ఉంది. కానీ ఈ కంపెనీ ఉద్దేశం భారతదేశాన్ని దోచుకోవడమే. అలాగే ఉగ్ర సంస్థ సిమి పేరులో కూడా ఇండియా ఉంది.'
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం..
PM Modi Farmers : దేశంలోని రైతులకు రూ.266కే యూరియా బస్తా అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీఅన్నారు. అదే యూరియా బస్తా ధర పాకిస్థాన్‌లో రూ.800, బంగ్లాదేశ్‌లో రూ.720, చైనాలో రూ.2,100 ఉందని తెలిపారు. యూరియా ధర కారణంగా రైతులు నష్టపోవడాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుమతించదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని సికర్‌లోని ఓ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్షా 25 వేల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను దేశానికి అంకితం చేశారు. ఈ కేంద్రాలను వన్‌స్టాప్ కేంద్రాలుగా అభివర్ణించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత నిధులను విడుదల చేశారు.
'గత తొమ్మిదేళ్లుగా రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుంది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. నగరాల్లో లభించే ప్రతి సౌకర్యాన్ని గ్రామాలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు కష్టపడి.. మట్టిలోనుంచి బంగారాన్ని వెలికి తీస్తారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. మా ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకుంటుంది.'
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అనారోగ్యం కారణంగా సికర్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకాలేదని ప్రధాని మోదీ అన్నారు. గహ్లోత్ గత కొన్నాళ్లుగా కాలి గాయంతో బాధపడుతున్నారని.. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు.. కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మోదీ అన్నారు.
ఆ డైరీలో ఏముందో తెలుసుకోలేరా?
Ashok Gehlot PM Modi : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. 'ప్రధాని పదవిపై గౌరవం ఉంది. ఐటీ, ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నారు. మరి రాజస్థాన్ రెడ్ డైరీలోని విషయాలను కనుక్కొలేరా?. ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో నేను పాల్గొని మాట్లాడవలసి ఉంది. కానీ బుధవారం రాత్రి అకస్మాత్తుగా నా ప్రసంగాన్ని షెడ్యూల్ నుంచి తప్పించారు. ఈ ధోరణి సరైనది కాదు.' అని గహ్లోత్ మండిపడ్డారు.
మోదీ పర్యటనకు గహ్లోత్ డుమ్మా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాజస్థాన్ పర్యటనకు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ గైర్హాజరయ్యారు. తమ రాష్ట్రానికి వచ్చే ప్రధానిని తాను కేవలం ట్విట్టర్ ద్వారానే ఆహ్వానించగలనని గహ్లోత్ అన్నారు. ప్రధాని కార్యక్రమంలో తన ప్రసంగాన్ని రద్దు చేయడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని గహ్లోత్ స్వయంగా ట్వీట్ చేశారు.
'ఈ రోజు మీరు రాజస్థాన్‌కు వస్తున్నారు. కానీ, ప్రధాని కార్యాలయం నా మూడు నిమిషాల ప్రసంగాన్ని షెడ్యూల్ నుంచి తొలగించింది. అందువల్ల, నేను నా ప్రసంగంతో మిమ్మల్ని ఆహ్వానించలేకపోతున్నా. అందుకే ట్విట్టర్ ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నా. నేను నా ప్రసంగంలో చెప్పాలనుకున్న డిమాండ్లను కూడా ట్విట్టర్ ద్వారానే మీ ముందుంచుతున్నా. గత 6 నెలల్లో ఏడోసారి రాజస్థాన్ రాష్ట్ర పర్యటనకు వస్తున్న మీరు ఈ సారైనా మా డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తున్నా' అని గహ్లోత్ ట్వీట్ చేశారు.
పీఎంఓ స్పందన..
అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చేసిన ట్వీట్‌కు ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంఓ) స్పందించింది. 'ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాం. మీ ప్రసంగానికి సమయాన్ని కూడా కేటాయించాం. కానీ, మీరు ఈ కార్యక్రమానికి రాలేరని సీఎంఓ నుంచి సమాచారం వచ్చింది. సికర్‌లో జరుతుతున్న కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అభివృద్ధి పనుల శిలాఫలకాలపైనా మీ పేరును ఉంచాం' అని పీఎంఓ ట్వీట్ చేసింది.