ప్రపంచమంతా భారత్‌ను చూసి ప్రశంసిస్తోంది తన వల్ల కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భాజపా కార్యకర్తలపై దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకమే ఈ ప్రశంసలకు కారణమని పేర్కొన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించిన ఆయన.. ప్రజలతో సన్నిహితంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిలా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. భాజపా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవా హీ సంఘటన్ కార్యక్రమం గురించి విస్తృతంగా మాట్లాడిన ఆయన.. సమాజానికి పార్టీ కార్యకర్తలు చేసిన సేవను కొనియాడారు.
"సాధారణ ప్రజలతో మమేకమైనందువల్లే భాజపా ఈ స్థాయిలో ఉంది. భాజపా ఏ కుటుంబానికీ కేంద్రంగా పనిచేయదు. పార్టీని కుటుంబమే నడిపించదు. సేవ, సంకల్పం, అంకిత భావమే పార్టీ విలువలు. తొలి నుంచీ పార్టీతో ఉన్న కార్యకర్తలను గౌరవించాల్సిన అవసరం ఉంది. భాజపా కార్యకర్తలు సరికొత్త సేవా సంస్కృతిని తీసుకొచ్చారు. దేశం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో 'సేవా హీ సంఘటన్' ద్వారా చేసిన సేవలు అసమానం.
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో కీలక చర్చ జరిగింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అధ్యక్షులు.. సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల సమస్యలపైనే దృష్టిసారిస్తున్నందున.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని భాజపా గెలుచుకుంటుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
"ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల భాజపా అధ్యక్షులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతుంటే... వారిలో ఓ విశ్వాసం కనిపించింది. గత ఐదేళ్లలో చేసిన పని నుంచి వచ్చిన సంతృప్తితోనే వారు ఇంత విశ్వాసంతో ఉన్నారు."
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్!
జాతీయ కార్యవర్గ సమావేశంలో (BJP National Executive Meeting) కీలక తీర్మానాన్ని భాజపా ఆమోదించింది. వివిధ అంశాలతో కూడిన పార్టీ తీర్మానాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశంలో ప్రవేశపెట్టగా... తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై, కిషన్ రెడ్డి, బిరెన్ సింగ్, అనురాగ్ ఠాకూర్, ప్రమోద్ సావంత్, అశ్వినీ వైష్ణవ్, పుష్కర్ ధామీ మద్దతు తెలిపారు.