వలసవాదంపై పోరును క్విట్ ఇండియా ఉద్యమం మరింత బలోపేతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్విట్ ఇండియా 79వ వార్షికోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన.. ఉద్యమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ నివాళులు అర్పించారు.
మహాత్మా గాంధీ ప్రేరణతో క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్లో స్ఫూర్తి నింపిందని మోదీ పేర్కొన్నారు. దేశ యువతను ఉత్తేజితులను చేసిందని అన్నారు.
"క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహాత్ములందరికీ నివాళులు. ఈ ఉద్యమం వలసవాదంపై పోరాటాన్ని బలోపేతం చేసింది. మహాత్మా గాంధీ ప్రేరణతో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది, దేశ యువతను ఉత్తేజితులను చేసింది."
-నరేంద్ర మోదీ, ప్రధాని
సామాజిక దురాచారాలు నిర్మూలిద్దాం: వెంకయ్య
క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న సమరయోధుల త్యాగాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్మరించుకున్నారు. వలసపాలన నుంచి మాతృభూమికి స్వేచ్ఛను అందించే పోరాటంలో పాల్గొని లెక్కలేనని త్యాగాలు చేసిన భరతమాత ముద్దుబిడ్డల సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం అంటూ ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.
పేదరికం, నిరక్ష్యరాస్యత, అసమానత్వం, అవినీతి, కుల-మతాల పట్టింపులు, లింగవివక్ష వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించే దిశగా పునరంకింతమవుదామంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఆత్మనిర్భర భారత్ దిశగా ఆత్మవిశ్వాసంతో, సంఘటితంగా అడుగులు వేద్దామంటూ పిలుపునిచ్చారు.
క్విట్ ఇండియా
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో క్విట్ ఇండియా కీలక పాత్ర పోషించింది. గాంధీజీ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు బ్రిటీష్పై పోరాటానికి దిగారు. ఈ ఉద్యమం సందర్భంగానే మహాత్ముడు 'డూ ఆర్ డై'(విజయమో వీరమరణమో) నినాదాన్ని ఇచ్చారు.
క్విట్ ఇండియా ఉద్యమంపై ప్రత్యేక కథనాలు: