PM Modi Pays Tribute To Atal Bihari Vajpayee :భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు దిల్లీలోని 'సదైవ్ అటల్'ను సందర్శించారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్, ప్రధాని మోదీ ఇతర కేంద్ర మంత్రులు పూలతో అటల్ స్మారకానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాన్ని కొద్ది సేపు వీక్షించారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఆయన జీవితాంతం దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమృత్కాల్ సమయంలో వాజ్‌పేయీ అంకితభావం, సేవ దేశానికి స్ఫూర్తిని కలిగిస్తాయని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మదన్మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాలవీయ సాటిలేని వ్యక్తిత్వం, పని దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు.
వాజ్‌పేయీకి నీతీశ్ నివాళులు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ పట్నాలోని అటల్ పార్క్ వద్ద నివాళులర్పించారు. 'ఈరోజు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి. నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. ఆయన ప్రభుత్వంలో నేను కేంద్ర మంత్రిగా పని చేశాను. అటల్జీ నన్ను చాలా గౌరవించేవారు.' అని నీతీశ్ మీడియాతో చెప్పారు.