PM Modi Speech Palamuru Praja Garjana Public Meeting : పాలమూరు వేదికగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించింది. పాలమూరు ప్రజాగర్జనలో పాల్గొన్న ప్రధాని మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై విరుచుకుపడ్డ ప్రధాని.. ఆ రెండు పార్టీలు కుటుంబపాలనలో మగ్గిపోతున్నాయని ఆక్షేపించారు. ఆ రెండు పార్టీల వైఖరి వల్లే తెలంగాణ ప్రగతి కుంటుపడుతోందని విమర్శించారు. భారత్ రాష్ట్ర సమితి, మజ్లిస్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో పోల్చిన మోదీ.. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలు కోరుకుంటున్న పారదర్శక ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
"తెలంగాణ సర్కార్‌ని నడిపే గులాబీ పార్టీ గుర్తు కారు. ఆ కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో.. ఈ ప్రభుత్వాన్ని ఎవరిని నడుపుతారో మీ అందిరికీ తెలుసు. ఈ రెండు కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. ఈ రెండు పార్టీలు అవినీతికి, కమీషన్లకు పెట్టింది పేరు. రెండు పార్టీలకు ఉన్న ఫార్ములా కుటుంబం మాత్రమే. కుటుంబం ద్వారా, కుటుంబం కోసం , కుటుంబహితమే పరమావధిగా పనిచేస్తున్నాయి. వీకు ప్రజాస్వామ్యాన్ని కుటుంబ వ్యవస్థగా మార్చారు. రాజకీయపార్టీలను సైతం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసి నడుపుతున్నారు. ఆ సదరు కంపెనీలో ప్రెసిడెంట్, సీఈవో, డైరెక్టర్, జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్, ట్రెజరర్ సైతం కుటుంబ వ్యక్తులే నిర్వహిస్తారు. కానీ వారి అవసరాల కోసం మాత్రం సహాయకసిబ్బంది సాధారణ వ్యక్తులను నియమిస్తారు. అత్యున్నత పదవులను మాత్రం వారు అలంకరిస్తారు. మిగతావాళ్లకు మాత్రం అప్రాధాన్య పోస్టుల్లో భాగస్వామ్యం చేస్తారు."- నరేంద్ర మోదీ, ప్రధాని
PM Modi Comments on Telangana Government :రైతుల సంక్షేమాన్ని బీఆర్ఎస్ సర్కార్ (Telangana Government) గాలికొదిలేసిందని విమర్శించారు. సాగనీటి ప్రాజెక్టులపేరిట ప్రభుత్వ పెద్దలు దోపిడీ పర్వానికి తెరతీశారని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వం.. ఆ హామీని విస్మరించి.. కర్షకులను మోసం చేసిందని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ రైతులకు మేలు చేకూర్చే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోందని గణాంకాలతో సహా మోదీ వివరించారు. బీజేపీపై ప్రజలు చూపిస్తున్న ప్రేమను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సాగుదారులు ఆత్మహత్యలు పెరిగాయని మోదీ విమర్శించారు.