పంజాబ్ రాజకీయ దిగ్గజం, శిరోమణి అకాలీదళ్ అగ్ర నేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) భౌతక కాయానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అందుకు గాను బుధవారం ఉదయం చండీగఢ్ చేరుకున్నారు మోదీ. పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లతో కలిసి ఎస్‌ఏడీ కార్యాలయానికి మోదీ వెళ్లారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయానికి ప్రధాని మోదీ నివాళులు అనంతరం ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి.. అంజలి ఘటించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో మోదీ కాసేపు మాట్లాడారు. బాదల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోదీ కొద్ది నిమిషాలే ఎస్‌ఏడీ కార్యాలయంలో ఉన్నారు. మోదీ వెళ్లిన వెంటనే.. బాదల్ భౌతికకాయాన్ని ముక్త్‌సర్‌లోని ఆయన స్వగ్రామానికి తీసుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం అక్కడ అంత్యక్రియలు జరుగనున్నాయి.
ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయం వద్ద మోదీ నివాళులు అర్పించేందుకు తరలివచ్చిన కార్యకర్తలు
ఏడు దశాబ్దాలకు పైగా పంజాబ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయాన్ని సందర్శనార్థం బుధవారం ఉదయం కొద్ది గంటలపాటు పార్టీ కార్యాలయంలో ఉంచారు. నివాళులు అర్పించేందుకు ప్రముఖులు, కార్యకర్తలు తరలివచ్చారు. మాజీ ముఖ్యమంత్రికి గౌరవ సూచకంగా పంజాబ్ ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు గురువారం మూతపడతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 26, 27 తేదీలను సంతాప దినాలుగా ప్రకటించింది.
'రైతుల సంక్షేమానికి బాదల్ విశేషమైన కృషి చేశారు'
శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ మరణంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. పంజాబ్ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించిన రాజకీయ ప్రముఖులుగా బాదల్‌ను అభివర్ణించారు. "తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పంజాబ్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా రైతుల సంక్షేమం కోసం విశేష కృషి చేశారు. బాదల్‌తో అనేక సమస్యలపై నేను జరిపిన చర్చలు.. నాకు మధురమైన జ్ఞాపకాలుగా ఉన్నాయి. బాదల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని మన్మోహన్ సంతాపం తెలిపారు.
ప్రకాశ్ సింగ్ బాదల్.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితమే మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూసినట్లు ఆయన కుమారుడు, ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. బాదల్‌కు కుమారుడు సుఖ్‌బీర్ సింగ్, కుమార్తె పర్నీత్ కౌర్ ఉన్నారు. సుఖ్‌బీర్ ఆయనకు రాజకీయ వారసుడుకాగా.. పర్నీత్ మాజీ మంత్రి ఆదేశ్ ప్రతాప్‌సింగ్ కైరాన్ సతీమణి. సుఖ్‌బీర్ సతీమణి హర్‌సిమ్రత్ కౌర్ బఠిండా ఎంపీగా ఉన్నారు.
11 సార్లు ఎమ్మెల్యేగా.. 5 సార్లు ముఖ్యమంత్రిగా..
పంజాబ్ రాజకీయాల్లో ప్రకాశ్ సింగ్ బాదల్‌ది చెరగని ముద్ర. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పంజాబ్‌కు 5 సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రకాశ్ సింగ్ బాదల్ 1927 డిసెంబరు 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా అనే గ్రామంలో జన్మించారు. లాహోర్‌లోని ఫార్మన్ క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ చదివారు. గ్రామీణ నేపథ్యమున్న ఆయన ఎన్నికల చరిత్రలో అనేక రికార్డులను నెలకొల్పారు.
అతి పిన్నవయసు సీఎంగా రికార్డు
1947లో బాదల్ అనే గ్రామానికి సర్పంచిగా ఎన్నికయ్యారు. అప్పట్లో అత్యంత చిన్న వయసులో సర్పంచి పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత బ్లాక్ అధ్యక్షుడిగా పని చేశారు. 1957 జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాలౌత్ నుంచి మొదటిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1969లో మరోసారి ఎస్‌ఏడీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1970లో తొలిసారిగా పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎస్‌ఏడీ ప్రభుత్వాన్ని చీల్చి అప్పటి ముఖ్యమంత్రి గుర్నాంసింగ్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మిగిలిన ఎస్‌ఏడీ నేతలతో కలిసి జనసంఘ్ మద్దతుతో బాదల్ సీఎం పదవిని చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 43 ఏళ్లు. అప్పట్లో పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఆయన అత్యంత పిన్న వయస్కుడు.
అత్యంత పెద్ద వయస్కుడిగానూ రికార్డు..
2012లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయస్సు 84 ఏళ్లు. సీఎం పదవిని చేపట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగానూ ఆయనే రికార్డు సృష్టించారు. కేంద్ర మంత్రిగా వ్యవసాయం, నీటి పారుదలశాఖ బాధ్యతలను నిర్వర్తించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాంబి నుంచి ఆయన పోటీ చేశారు. దేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు. ఆయన ఆ ఎన్నికలో ఓడిపోయారు.